ఉపాధిహామీ పనుల్లో నిర్లక్ష్యం తగదు
మాగనూర్: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి సంబంధించి పనుల నిర్వహణలో అధికారులు నిర్లక్ష్యం కనిపిస్తుందని, మరోసారి ఇలాగే ప్రవర్తిస్తే కఠిన చర్యలు తప్పవని డీఆర్‌డీఓ మొగులప్ప అన్నారు. మాగనూర్ మండలంలోని ఉపాధి హామీ పథకానికి సంబంధించి 15వ సామాజిక తనిఖీ ప్రజావేదిక శనివారం(రెండవ రోజు) ఎంపీడీవో కార్యాలయం అవరణలో ఎంపీడీవో శ్రీనివాసులు అధ్యక్షతన జరిగింది. మొదటి రోజు కార్యక్రమం రాత్రి సమయంలో నిర్వహిస్తున్నారనే విమర్శలు రావడంతో వాయిదా వేసి రెండవ రోజు నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా డీఆర్‌డీవో అధికారి మొగులప్ప పాల్గొన్నారు. ఏప్రిల్ 2024 నుంచి మార్చి 2025 వరకు జరిగిన పనులకు రూ.2.90 కోట్లు ఖర్చు చేసిన దానిపై ఈ సామాజిక తనిఖీ ప్రజావేదిక సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని ఎంపీడీవో తెలిపారు. అనంతరం డీఆర్‌డీవో మొగులప్ప మాట్లాడుతూ.. ఉపాధి హామీ పథకం పనుల సంబంధించి అన్ని శాఖల అధికారుల ఆలసత్వం కలిపిస్తుందని అన్నారు. నిర్లక్ష్యం వహించిన అధికారులకు, ఫీల్డ్ అసిస్టెంట్లతో పాటు సీనియర్ మేటీలకు జరిమానా విధించడం జరిగిందన్నారు. ఏప్రిల్ 2024 నుంచి మార్చి 2025 పనులకు సంబంధించి మొత్తం రూ.లక్ష రికవరీ చేయడం జరుగుతుందని తెలిపారు. ముఖ్యంగా కొన్ని గ్రామాల్లో సొంత కుటుంబ సభ్యులు, కూలీలు పనులు చేసినట్లు వారి అకౌంట్‌లో డబ్బులు వేయించి, ఎఫ్‌ఏలు, సీనియర్‌మేటీలు తీసుకున్నట్లు తెలిసిందని, వీటనింటిపై అధికారులు విచారణ చేయాలని ఆదేశించారు. ఇలా అవినితికి పాల్పడితే అట్టి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మండల కేంద్రంలోని పనుల్లో సీనియర్ మేటి పలు అవకతవకలకు పాల్పడినట్లు గుర్తించి రూ.65 వేలు రికవరీకి అదేశించారు. క్షేత్రస్థాయిలో పనులు జరిగినప్పటికి అధికారులు రికార్డులు మెయింటెన్ చేయడంలో నిర్లక్ష్యం వహించడంపై అసహనం వ్యక్తం చేశారు. మరోసారి ఇలాంటి పనులు చేస్తే సస్పెండ్ చేయాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఓబ్లాపూర్‌లో ఒకే కుటుంబంలో ఇద్దరు మైనర్లకు జాబ్‌కార్డు జారీ చేసి వారితో పని చేయించినట్లు తనిఖీ బృందం అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. అదే విధంగా ఓబ్లాపూర్‌లో ఎంపీడీవో సంతకం లేకుండానే నగదు కూలీల అకౌంట్‌లో జమ చేసినట్లు తేలింది. విచారించి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాసులు, ఎస్‌ఆర్పీ రాజు, జిల్లా విజిలెన్స్ అధికారి గోపాల్‌యాదవ్, ఎపీఓ మన్యం తదితరులు పాల్గొన్నారు.


