నిబంధనలు పట్టవా.. ?
బడిఈడు పిల్లలతో పని చేయించొద్దు.. వాహనాల్లో స్థాయికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవద్దు.. అని ఎన్ని నిబంధనలు ఉన్నా కొందరికి అవేవి పట్టట్లేదు. నెల రోజులుగా జిల్లాలోని వివిధ గ్రామాల్లో బాలలను పత్తి ఏరడానికి తీసుకొని వెళ్లడం పరిపాటిగా మారింది. తాజాగా రెండో శనివారం కావడంతో పాఠశాలకు సెలవు ఇచ్చారు. దీంతో పెద్ద ఎత్తున పిల్లలను వ్యవసాయ పనులకు తీసుకెళ్లడం కనిపించింది. నారాయణపేట మండలం శ్యాసన్‌పల్లి నుంచి ఊట్కూరు మండలం తిప్రాస్‌పల్లికి వాహనంలో ప్రమాదకరంగా ప్రయాణిస్తూ శనివారం ‘సాక్షి’ కెమెరాకు చిక్కారు. అలాగే, జిల్లా కేంద్రంలోని పట్టణ పోలీస్ స్టేషన్‌ను దాటుతూ మరో వాహనంలో ఇలా కూలీలను, పిల్లలను ప్రమాదకరంగా తీసుకువెళ్లడం కనిపించింది. ఇప్పటికై నా పోలీసులు గుర్తించి ప్రమాదకరంగా పిల్లలను తీసుకెళ్తున్న వారిపై, వారితో పనిచేయిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. – నారాయణపేట రూరల్


