నేడు ఎస్‌ఎల్ బీసీకి సీఎం రాక
సాక్షి, నాగర్‌కర్నూల్: రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సోమవారం ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్ట్ అవుట్ లెట్ టన్నెల్‌ను సందర్శించనున్నారు. ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ పనులను కొనసాగించేందుకు హెలీకాప్టర్ ద్వారా ఏరియల్ ఎలక్ట్రో మ్యాగ్నటిక్ సర్వేను ప్రారంభించనున్నారు. సోమవారం మధ్యాహ్నం ఒంటిగంటకు నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం మన్నెవారిపల్లి సమీపంలోని ఎస్‌ఎల్‌బీసీ అవుట్ లెట్‌కు చేరుకొని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో కలిసి హెలీకాప్టర్ ద్వారా ఎలక్ట్రో మ్యాగ్నటిక్ సర్వేను పరిశీలిస్తారు. ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ తవ్వకాల్లో భాగంగా గత ఫిబ్రవరి 22న దోమలపెంట ఇన్‌లెట్ వద్ద సొరంగం కుంగి ఘోర ప్రమాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీబీఎం ద్వారా టన్నెల్ తవ్వకాలకు అవకాశం లేకపోవడంతో ప్రభుత్వం ప్రత్యామ్నాయ అవకాశాలపై దృష్టిసారించింది. ఇందులో భాగంగా సోమవారం నుంచి ఏరియల్ ఎలక్ట్రో మ్యాగ్నటిక్ సర్వే చేపట్టి టన్నెల్ మార్గంలో సుమారు వెయ్యి మీటర్ల వరకు లోతు వరకు ఉన్న షీర్‌జోన్, జియోఫిజికల్ పరిస్థితులను అంచనా వేయనున్నారు. ఆ తర్వాత టన్నెల్ తవ్వకాలపై నిర్ణ యం తీసుకుంటారు. నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (ఎన్జీఆర్‌ఐ) నిపుణుల ఆధ్వర్యంలో ఏరియల్ సర్వే చేపట్టనున్నారు.
కళాశాలల బంద్‌కు
సంపూర్ణ మద్దతు
నారాయణపేట రూరల్: ప్రైవేట్ కళాశాలలు సోమవారం నిర్వహించ తలపెట్టిన విద్యాసంస్థల బంద్‌కు పీడీఎస్‌యూ విద్యార్థి సంఘం సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుందని ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు సాయికుమార్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆదివారం స్థానిక భగత్ సింగ్ భవన్‌లో ఆయన మాట్లాడుతూ.. పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్, ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఆరేళ్లలో రాష్ట్రంలో రూ.8150 కోట్ల దాకా స్కాలర్‌షిప్, ఫీజు రీయింబర్స్‌మెంట్ పెండింగ్‌లో ఉందని అన్నారు. వెంటనే ప్రభుత్వం నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో వెంకటేష్, మహేష్, సురేష్, మహిపాల్, మణికంఠ, గురు రాజ్ పాల్గొన్నారు.
5న సామూహిక
సత్యనారాయణస్వామి వ్రతం
ఎర్రవల్లి: బీచుపల్లి పుణ్యక్షేత్రంలోని కోదండరామస్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని 5వ తేదీన బుధవారం ఉదయం 10.30 గంటలకు సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహించనున్నట్లు ఆలయ మేనేజర్ సురేందర్‌రాజు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. వ్రతంలో పాల్గొనే భక్తులు ముందుగా రూ.1516 చెల్లించి తమ పేరును నమోదు చేసుకోవాలని, ఆలయ పాలక మండలి ఆధ్వర్యంలో నమోదు చేసుకున్న భక్తులకు పూజా సామగ్రిని అందిచనున్నట్లు తెలిపారు. వ్రతానికి వచ్చే భక్తులు తమ వెంట దీపాలు, గంట, హారతి తీసుకురావాలని ఆయన సూచించారు.
సేంద్రియ ఎరువుల
వాడకంతో అధిక దిగుబడి
లింగాల: రైతులు పంటల సాగులో రసాయనిక ఎరువులకు ప్రత్యామ్నాయంగా సేంద్రియ ఎరువులు వాడడం ద్వారా పంట దిగుబడి అధికంగా వస్తుందని పాలమూరు యూనివర్సిటీ విద్యార్ధులు అన్నారు. సేంద్రియ పద్ధతిలో సాగు చేసిన పంటను ఆహారంగా తీసుకోవడం ద్వారా అనారోగ్య సమస్యలు దరిచేరవని అవగాహన కల్పించారు. పాలమూరు యూనివర్సిటీకి చెందిన డిపార్ట్‌మెంట్ ఆఫ్ సోషల్ వర్క్ విద్యార్థులు మండలంలోని అప్పాయపల్లిలో ఆదివారం రూరల్ క్యాంప్ నిర్వహించారు. అందులో భాగంగా గ్రామంలో ఇంటింటికీ తిరిగి ప్రజల జీవన విధానంపై సర్వే చేశారు. మొక్కజొన్న, వరి, వేరుశనగ, మినుములు, ఆయిల్‌ఫాం, డ్రాగన్ ఫ్రూట్‌లలో ఉపయోగించే మందుల గురించి ఆరా తీశారు. గ్రామంలో పంటకు రసాయనిక మందుల వాడకం ఎక్కువగా ఉందని గమనించి, వర్మీ కంపోస్టు ఎరువులను వాడాలని రైతులకు సూచించారు. పలు అంశాలపై కళా ప్రదర్శనల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సోషల్ వర్క్ విభాగం అధ్యాపకులు డాక్టర్ బి.పర్వతాలు, డాక్టర్ గాలెన్న, విద్యార్థులు మశ్చేందర్, రాజేష్, శంకర్, ప్రశాంత్, గోపాల్, రాజేష్, బుగ్గప్ప, స్వప్న, విజయ, ఆశమ్మ, స్వాతి, మహేశ్వరి, అనూష్ తదితరులు పాల్గొన్నారు.
							నేడు ఎస్‌ఎల్ బీసీకి సీఎం రాక

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
