
‘స్థానిక’ ఆశలపై నీళ్లు
హైకోర్టు తీర్పుతో ఎన్నికల నోటిఫికేషన్‌ను రద్దు చేసిన ఈసీ
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్/ సాక్షి, నాగర్‌కర్నూల్: స్థానిక సంస్థల ఎన్నికలకు హైకోర్టు తీర్పుతో తాత్కాలికంగా బ్రేక్ పడింది. ఇప్పటికే విడుదలైన ఎన్నికల నోటిఫికేషన్‌పై హైకోర్టు స్టే విధించడంతో ఎన్నికల నిర్వహణ నిలిచిపోనుంది. దీంతో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుదలతో పోటీకి సిద్ధమైన ఆశావహుల్లో అయోమయం, నైరాశ్యం నెలకొంది. తాజా పరిణామాల నేపథ్యంలో ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందోనన్న దానిపై ఆశావహులు ఎదురుచూస్తున్నారు.
కరువైన స్పందన..
స్థానిక ఎన్నికలకు ఈసీ గత నెల 29న షెడ్యూల్ విడుదల చేసింది. రెండు విడతల్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు, మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేసింది. ఈ క్రమంలోనే గురువారం నుంచి తొలివిడత ప్రాదేశిక ఎన్నికలకు నామినేషన్ల పర్వం సైతం మొదలైంది. అయితే బీసీ రిజర్వేషన్ల అమలు అంశంపై కోర్టులో పెండింగ్‌లో ఉండటంతో మొదటిరోజు నామినేషన్లకు అభ్యర్థు లు ఆసక్తి చూపలేదు. తొలిరోజున ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జెడ్పీటీసీ స్థానానికి ఒకే ఒక్క నామినేషన్ దాఖలైంది. అలాగే ఎంపీటీసీ స్థానాల్లో కేవలం 13 నామినేషన్లను అభ్యర్థులు దాఖలు చేశారు. నాగర్‌కర్నూల్ జిల్లా చారకొండ జెడ్పీటీసీ స్థానానికి సంబంధించి కాంగ్రెస్ తరపున చందులాల్ నామినేషన్ వేశారు. ఈ ఒక్క నామినేషన్ మినహా ఉమ్మడి జిల్లాలో ఎక్కడా జెడ్పీటీసీ స్థానానికి నామినేషన్ రాలేదు. అలాగే నాగర్‌కర్నూల్ జిల్లాలో ఎంపీటీసీ స్థానాలకు మూడు నామినేషన్లు రాగా, ఇందులో కాంగ్రెస్ తరఫున ఒకటి, ఇండిపెండెంట్ అభ్యర్థిగా మరొకరు నామినేషన్ సమర్పించారు. వనపర్తి జిల్లా పెబ్బేరు మండలంలో కాంగ్రెస్ తరపున రెండు నామినేషన్లు, గోపాల్‌పేట మండలంలో ఇండిపెండెంట్‌గా ఒకరు నామినేషన్ వేశారు. నారాయణపేట జిల్లాలో ఐదు ఎంపీటీసీ స్థానాలకు నామినేషన్లు వచ్చాయి. మహబూబ్‌నగర్ జిల్లా రాజాపూర్ ఎంపీటీసీ స్థానానికి బీజేపీ తరపున ఒక నామినేషన్ దాఖలైంది. జోగుళాంబ గద్వాల జిల్లాలో మల్దకల్ మండలం తాటికుంట ఎంపీటీసీ స్థానానికి కాంగ్రెస్ తరపున ఒక నామినేషన్ దాఖలైంది. ఉదయం సందడిగా కనిపించిన గ్రామాలు కోర్టు స్టే రావడంతో సాయంత్రానికి చతికిలపడ్డాయి.
రిజర్వేషన్లు తేలే వరకు..
స్థానిక సంస్థల ఎన్నికలకు హైకోర్టు బ్రేక్ వేసిన నేపథ్యంలో ప్రధాన పార్టీల కేడర్, ఆశావహుల్లో తీవ్ర నైరాశ్యం నెలకొంది. పంచాయతీ పాలకవర్గాలు, జెడ్పీటీసీ, ఎంపీటీసీల పదవీకాలం పూర్తయ్యి ఏడాదిన్నర కాలం గడిచింది. సుదీర్ఘకాలంగా ఎన్నికలకు కోసం ఆశావహులు ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తూ జీవో విడుదల చేయడంతో బీసీ వర్గాలకు దక్కే స్థానాల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. ఎన్నికల నోటిఫికేషన్ సైతం విడుదల కావడంతో పెద్ద సంఖ్యలో ఆశావహులు ఎన్నికలకు సన్నద్ధమవుతున్నారు. బీసీ వర్గాలకు రిజర్వేషన్ల పెంపు, రిజర్వేషన్ల కేటాయింపుతో ఆయా స్థానాల్లో పోటీ చేసి తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సన్నాహాలు మొదలుపెట్టారు. తాజాగా ఎన్నికల నిర్వహణ నిలిచిపోనుండటం ఆశావహులు, ప్రధాన పార్టీల కేడర్‌లో నైరాశ్యం నింపింది. కోర్టు తీర్పు ప్రకారం కనీసం నెల రోజుల తర్వాతే ఎన్నికల నిర్వహణపై స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది. ప్రభుత్వం హామీ ఇచ్చినట్టుగా బీసీలకు రిజర్వేషన్లపై కోర్టులో తేలే వరకు వేచి చూస్తారా.. లేక పాత రిజర్వేషన్ల ప్రకారమే ఎన్నికలు నిర్వహిస్తారా.. అన్న దానిపైనే ఆసక్తి నెలకొంది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందోనన్న చర్చ కొనసాగుతోంది.
గ్రామాల్లో ఆశావాహుల్లో తీవ్ర నిరాశ
ఉదయం సందడి.. సాయంత్రం నిశ్శబ్ద వాతావరణం
ఆరు వారాల తరువాతే ‘స్థానిక’ ఎన్నికలపై స్పష్టత
ఉమ్మడి జిల్లాలో ఒక జెడ్పీటీసీ, 13 ఎంపీటీసీ స్థానాలకు నామినేషన్లు

‘స్థానిక’ ఆశలపై నీళ్లు