మూడు రోజులే గడువు.. | - | Sakshi
Sakshi News home page

మూడు రోజులే గడువు..

Oct 9 2025 6:37 AM | Updated on Oct 9 2025 6:37 AM

మూడు రోజులే గడువు..

మూడు రోజులే గడువు..

మూడు రోజులే గడువు.. కొనసాగుతున్న ఉత్కంఠ..

స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను కల్పించింది. దీనిపై హైకోర్టులో కేసు పెండింగ్‌లో ఉండగా తీర్పు గురువారానికి వాయిదా పడింది. గురువారం సాయంత్రానికి రిజర్వేషన్ల అంశంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. దీంతో గురువారం ఉదయం 10.30 నుంచి నామినేషన్లు ప్రారంభం కానుండగా.. బీసీ రిజర్వేషన్ల అమలుపై ఇంకా సందిగ్ధం నెలకొంది. ఈ నేపథ్యంలో ఏం జరుగుతుందోనన్న అయోమయం ఆశావహుల్లో నెలకొంది. తొలి విడత జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ప్రారంభమైనా ఇప్పటివరకు ప్రధాన రాజకీయ పార్టీలు తమ అభ్యర్థిత్వాలను ఖరారు చేయలేదు. రిజర్వేషన్ల అమలుపై హైకోర్టు తీర్పు నేపథ్యంలోనే పార్టీలు అభ్యర్థిత్వాలను పెండింగ్‌లో ఉంచినట్టు తెలుస్తోంది. దీంతో గురువారం నుంచి ఎన్నికల నామినేషన్లు మొదలవుతున్నా ప్రధాన రాజకీయ పార్టీల తరపున నామినేషన్లు దాఖలయ్యే అవకాశం కనిపించడం లేదు.

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌/ సాక్షి, నాగర్‌కర్నూల్‌: జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి తొలి విడత నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానున్నాయి. గురువారం ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థుల నుంచి అధికారులు నామినేషన్లను స్వీకరించనున్నారు. ఇందుకోసం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లను పూర్తిచేసింది. మొత్తం రెండు విడతల్లో ప్రాదేశిక ఎన్నికలను నిర్వహించనుండగా.. గురువారం నుంచి తొలివిడత ఎన్నికలకు నామినేషన్ల పర్వం మొదలుకానుంది. శనివారం తుది గడువు ఉండటంతో నామినేషన్ల దాఖలుకు కేవలం మూడు రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది.

షెడ్యూల్‌ ప్రకారం నిర్వహణ..

జెడ్పీటీసీ, ఎంపీటీసీ, గ్రామ పంచాయతీల ఎన్నికల నిర్వహణకు గత నెల 29న రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ముందుగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను రెండు విడతల్లో, తర్వాత గ్రామ పంచాయతీ ఎన్నికలను మూడు విడతల్లో నిర్వహించేందుకు షెడ్యూల్‌ ఖరారు చేసింది. ఇందులో భాగంగానే గురువారం నుంచి తొలి విడత జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు నామినేషన్ల పర్వం మొదలు కానుండగా ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. ఎంపీడీఓ కార్యాలయాల్లో తొలి విడత ఎన్నికలు నిర్వహించనున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థుల నుంచి నామినేషన్లను ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు స్వీకరిస్తారు. జెడ్పీటీసీ అభ్యర్థుల నామినేషన్లకు రిటర్నింగ్‌ అధికారిగా జిల్లాస్థాయి అధికారి, ఎంపీటీసీ అభ్యర్థుల నామినేషన్ల స్వీకరణకు రిటర్నింగ్‌ అధికారిగా ఎంపీడీఓ వ్యవహరించనున్నారు.

తొలి విడత జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో నామినేషన్ల స్వీకరణకు ఈ నెల 11 వరకే తుది గడువు ఉంది. గురువారం నుంచే నామినేషన్లను అధికారులు స్వీకరించనుండగా ఆయా స్థానాల్లో పోటీచేసే అభ్యర్థులు మంచిరోజు, ముహూర్తాలను బట్టి నామినేషన్లను దాఖలు చేసేందుకు సమాయత్తమవుతున్నారు. మరోవైపు గురువారమే బీసీ రిజర్వేష్లన్ల అంశంపై హైకోర్టు తీర్పు వచ్చే అవకాశం ఉండటంతో శుక్ర, శనివారాల్లోనే ఎక్కువ మంది నామినేషన్లు వేసే అవకాశం కనిపిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement