
వరి కొనుగోళ్లకు సన్నద్ధం
జిల్లాలో 3.12 లక్షల మె.ట. ధాన్యం సేకరణే లక్ష్యం
● 117 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు
● 78 లక్షల గన్నీ బ్యాగులు, 3,510 టార్పాలిన్లు అవసరమని అంచనా
● కేంద్రాల్లో కనీస సౌకర్యాల కల్పనకు చర్యలు
నర్వ: జిల్లాలో సాగుచేసిన వానాకాలం వరి ధాన్యం కొనుగోలుకు సంబంధిత అధికారులు సన్నాహాలు ప్రారంభించారు. ధాన్యం సేకరణపై ఇప్పటికే కలెక్టర్ ముందస్తు సమావేశం నిర్వహించి దిశా నిర్దేశం చేశారు. ప్రాథమిక సహకార సంఘం, మెప్మా, ఎఫ్‌పీఓ, మార్కెటింగ్‌శాఖ ఆధ్వర్యంలో మొత్తం 117 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. వారంలో కేంద్రాలు ప్రారంభించే అవకాశం ఉండగా.. వచ్చే నెలలో పంట కోతల ఆధారంగా మిగతా చోట్ల పూర్తిస్థాయిలో ప్రారంభించాలని నిర్ణయించారు.
4.28 లక్షల మె.ట. దిగుబడి..
వానాకాలం సీజన్‌లో జిల్లావ్యాప్తంగా 4.28 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇందులో 3.12 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలని లక్ష్యంగా నిర్ణయించారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా గన్నీ బ్యాగులు అందుబాటులో ఉంచాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. కేంద్రాలు ప్రారంభం కాగానే అవసరాన్ని బట్టి సంచులు తెప్పించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.
71 వేల హెక్టార్లలో..
జిల్లావ్యాప్తంగా 71,063 హెక్టార్లలో వరి సాగుకాగా.. ఇందులో సన్న రకం 56,082 హెక్టార్లు, దొడ్డురకం 14,981 వేల హెక్టార్లు ఉన్నట్లు వ్యవసాయ అధికారులు తెలిపారు. ప్రభుత్వం ఏ గ్రేడ్ ధాన్యం క్వింటాకు రూ.2,389, సాధారణ రకం క్వింటాకు రూ.2,369 మద్దతు ధర చెల్లించనుంది.
జిల్లావ్యాప్తంగా 4.28 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి రాగా.. స్థానిక అవసరాలకు 85,767 మెట్రిక్ టన్నులు వినియోగించే అవకాశం ఉంది. మిల్లర్లు, ట్రేడర్లు 30,457 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసే అవకాశం ఉండగా.. మిగిలిన 3.126 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించాలని నిర్ణయించింది. ఇందుకుగాను 78.15 లక్షల గన్నీ బ్యాగులు అవసరం ఉండగా.. ప్రస్తుతం 19.01 లక్షలు అందుబాటులో ఉన్నాయి. ఇంకా 59.14 కొత్తవి సేకరించాల్సి ఉంది. 3,510 టార్పాలిన్లు అవసరం కాగా.. ప్రస్తుతం 3,029 ఉన్నాయి. కేంద్రాల నుంచి మిల్లులు, గోదాంలకు ధాన్యం తరలింపునకు లారీలు సిద్ధంగా ఉంచేందుకు అధికారులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు.