
ఆర్టీసీ లక్కీ డ్రాకు విశేష స్పందన
● రీజినల్ మేనేజర్
సంతోష్‌కుమార్
స్టేషన్ మహబూబ్‌నగర్: ఆర్టీసీ లక్కీడ్రాకు ప్రయాణికుల నుంచి విశేషమైన స్పందన లభించిందని రీజినల్ మేనేజర్ సంతోష్‌కుమార్ అన్నారు. గత నెల 27 నుంచి ఈనెల 6వ తేదీ వరకు డీలక్స్, సూపర్ లగ్జరీ బస్సుల్లో (ఎలక్ట్రికల్ వాహనాలతో సహా) ప్రయాణించే వారికి లక్కీడ్రా నిర్వహించారు. బుధవారం జిల్లాకేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆర్‌టీఓ రఘుకుమార్ చేతుల మీదుగా లక్కీడ్రా తీసి విజేతలను ప్రకటించారు. ప్రథమ శివశంకర్, ద్వితీయ బిందు, తృతీయ మోక్షజ్ఞలు నిలవగా వారికి ఫోన్ ద్వారా సమాచారం అందజేశారు. ఈ సందర్భంగా ఆర్‌ఎం మాట్లాడుతూ ఆర్టీసీ సురక్షితమైన ప్రయాణానికి కేరాఫ్‌గా నిలుస్తున్నదన్నారు. దసరా పండుగ రోజుల్లో ఉమ్మడి జిల్లా ప్రయాణికులు ఆర్టీసీని ఎంతో ఆదరించారని తెలిపారు. మహబూబ్‌నగర్ రీజియన్‌లోని ప్రధాన బస్టాండ్లలో ఏర్పాటు చేసిన 17 బాక్సుల్లో లక్కీడ్రా తీసినట్లు చెప్పారు. మొదటి బహుమతి రూ.25 వేలు, ద్వితీయ బహుమతి రూ.15 వేలు, మూడో బహుమతి రూ.10 వేలు అందజేయనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ మేనేజర్ (ఆపరేషన్) లక్ష్మిధర్మ, డిపో మేనేజర్ సుజాత తదితరులు పాల్గొన్నారు.