
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
నారాయణపేట: బ్యాంక్‌లలో డబ్బు జమ, డ్రా చేసే సమయంలో అప్రమత్తంగా ఉండాలని సీఐ శివశంకర్ సూచించారు. జిల్లా కేంద్రంలోని వివిధ బ్యాంకుల్లో ఎస్‌ఐ వెంకటేశ్వర్లుతో కలిసి గురువారం ఆయన ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా బ్యాంక్ పరిసరాల్లో భద్రతా ఏర్పాట్లు పరిశీలించి, కస్టమర్లకు పలు సూచనలు చేశారు. వ్యక్తిగత వివరాలు, ఓటీపీ, ఏటీఎం పిన్ నంబర్లు ఎవరికీ చెప్పొద్దన్నారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే లోకల్ పోలీసులకు సమాచారం ఇవ్వాలని అని సూచించారు. అలాగే ఎస్‌ఐ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ బ్యాంక్ సిబ్బందికి సీసీ కెమెరాలు సరిగా పనిచేస్తున్నాయా లేదా నిర్ధారించుకోవాలన్నారు. ప్రజలు సైబర్ నేరాలు, బ్యాంక్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. ఏవైనా అనుమానాస్పద ఘటనలు గమనిస్తే వెంటనే డయల్ 100కు సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు.