
1,259 ఎకరాలవరిపంటకు నష్టం
కృష్ణా: కృష్ణా, భీమానది పరీవాహక ప్రాంతాల్లో వరదల కారణంగా మండలంలో 1,259 ఎకరాల వరిపంటకు నష్టం వాటిల్లిందని జిల్లా వ్యవసాయ అధికారి జాన్‌సుధాకర్ తెలిపారు. మంగళవారం మండల వ్యవసాయ అధికారి సుదర్శన్‌గౌడ్, వ్యవసాయ సిబ్బందితో కలిసి పంటలను పరిశీలించి మాట్లాడారు. మండలంలో వరితో పాటు పత్తి పంట కూడా దెబ్బతిందని.. రెండు పంటల నష్టం వివరాల పూర్తి నివేదిక తయారు చేస్తున్నట్లు వివరించారు. అన్ని గ్రామాల్లో ఇప్పటికే తమ సిబ్బంది పర్యటించి వివరాలు నమోదు చేసినట్లు తెలిపారు.
‘మద్దూరు ఘటనపైవిచారణ చేపట్టాలి’
నారాయణపేట రూరల్: మద్దూరు మండలంలో ఓ వర్గం అరాచకాలకు గిరిజన యువకుడు ఆత్మహత్య చేసుకొని సూసైడ్ నోట్ రాశారని.. పోలీసులు సమగ్ర విచారణ జరిపి నిజాలు నిగ్గు తేల్చాలని బీజేపీ రాష్ట్ర సీనియర్ నేత, రాష్ట్ర క్రమశిక్షణ సంఘం సభ్యుడు నాగురావునామాజీ డిమాండ్ చేశారు. మంగళవారం జిల్లాకేంద్రంలోని ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు సత్యయాదవ్, ప్రధానకార్యదర్శి లక్ష్మీగౌడ్, మాజీ ఉపాధ్యక్షుడు మదన్, చంద్రశేఖర్‌రెడ్డితో కలిసి మాట్లాడారు. ఆ వర్గ వ్యాపారులు అప్పులు ఇస్తామని అమాయకులను వలలో వేసుకొని ఇవ్వకుండానే సంతకాలు చేయించుకుని డబ్బుల కోసం వేధిస్తున్నారన్నారు. ఇదివరకు రామచంద్రప్ప వత్తిడితో మృతి చెందాడని పేర్కొన్నారు. పోలీసులు సమగ్ర విచారణ చేపట్టి వాస్తవాలు బయటపెట్టాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా ముఖ్యమంత్రి నియోజకవర్గంలో జరుగుతున్న ఇలాంటి దారుణాలను పోలీసులు అరికట్టాలని కోరారు.
షోకాజ్ నోటీసు
నారాయణపేట: జిల్లాలో నమోదైన గుర్తింపు లేని రాజకీయ పార్టీల జాబితాలో ఉన్న ఇండియన్ రక్షక నాయకుడు పార్టీ ఎన్నికల్లో పోటీ చేయనందున తగిన నిరూపణకు షోకాజ్ నోటీసు జారీ చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈ నెల 8లోగా ఆ పార్టీ అధ్యక్ష, కార్యదర్శులు హాజరై వివరాలు తెలియజేయాలని పేర్కొన్నారు. లేనిపక్షంలో ఎన్నికల సంఘం తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉండాలని సూచించారు.
మద్యం టెండర్ల ‘ఖాతా’ ప్రారంభం
మహబూబ్‌నగర్ క్రైం: ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఉన్న 227 మద్యం దుకాణాలకు టెండర్లు ఆహ్వానించగా మంగళవారం నాగర్‌కర్నూల్ ఈఎస్ పరిధిలో మూడు టెండర్లు దాఖలయ్యాయి. నాగర్‌కర్నూల్‌లో సర్కిల్ పరిధిలో ఉన్న రెండు దుకాణాలకు, కల్వకుర్తిలో ఒక దుకాణానికి టెండర్లు వచ్చాయి. అయితే ఈనెల 26 నుంచి ఉమ్మడి జిల్లాలో ఉన్న మద్యం దుకాణాలకు టెండర్ల ప్రక్రియ ప్రారంభం కాగా ఇప్పటి వరకు మూడు మాత్రమే వచ్చాయి. మహబూబ్‌నగర్, నారాయణపేట, వనపర్తి, గద్వాల జిల్లాలో ఇంకా ఖాతా ఒపెన్ కాలేదు. ఈనెల 18 వరకు టెండర్ల స్వీకరణకు గడువు ఉన్న క్రమంలో మద్యం వ్యాపారులు ఆలస్యం చేస్తున్నారు. చివరి వారం రోజుల్లో టెండర్ల వేగం పుంజుకుంటుంది. రెండేళ్ల కాలపరిమితిలో వచ్చే మద్యం వ్యాపారులకు స్థానిక ఎన్నికలతో పాటు మున్సిపల్, పంచాయతీ ఎన్నికలు కలిసి రానున్నాయి. దీంతో గతం కంటే ఈసారి టెండర్ల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.

1,259 ఎకరాలవరిపంటకు నష్టం