
నదీ పరివాహక ప్రాంత రైతులను ఆదుకుంటాం
● రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి
కృష్ణా: వరదల కారణంగా కృష్ణా, భీమానది పరీవాహక ప్రాంతాల్లోని వరి పంటలకు అపార నష్టం వాటిల్లిందని.. ప్రతి రైతును ప్రభుత్వం ఆదుకుంటుందని రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. మంగళవారం మండలంలోని వాసూనగర్, తంగిడి, కుసుమర్తి, సూకూర్ లింగంపల్లిలో పర్యటించి దెబ్బతిన్న వరి పంటలను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. రైతులు ఆందోళన చెందొద్దని, నష్టపోయిన రైతులను తాము అన్నివిధాలుగా ఆదుకుంటామని భరోసానిచ్చారు. ఇప్పటికే అధిక వర్షాలతో పత్తి రైతులకు నష్టం వాటిల్లిందని, ఇప్పుడు వరదలతో వరి పంటలు దెబ్బతిన్నాయని చెప్పారు. రెవెన్యూ అధికారులు పంటనష్టంతో పాటు ఇతరాత్ర నష్టం వివరాలను పూర్తిస్థాయి నివేదిక అందించాలని ఆదేశించారు. తంగిడి, కుసుమర్తిలో తాగునీటి అవసరాలకు చేతిపంపులు మంజూరు చేశారు. కృష్ణాలో రోడ్డు నిర్మాణ పనులను త్వరలో చేపడతామని హామీ ఇచ్చారు. నాయకులు సంతోష్ పాటిల్, సర్ఫరాజ్‌ఖాన్, విజప్పగౌడ, వీరేంద్రపాటిల్, నాగప్ప, మహదేవ్, మారెప్ప తదితరులు పాల్గొన్నారు.