
ఐక్యతతోనే దేశం సురక్షితం
కోస్గి: హిందువుల ఐకమత్యంతోనే దేశం సురక్షితంగా ఉంటుందని హిందూవాహిని ప్రాంత సంఘటన మంత్రి యాదిరెడ్డి అన్నారు. మంగళవారం పట్టణంలోని రాంలీలా మైదానంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ శత వసంత విజయదశమి ఉత్సవాలను కోస్గి మండలశాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ.. హిందూ సమాజాన్ని సంఘటితం చేయాలని, వ్యవస్థను ముందుకు తీసుకువెళ్లాలని, స్వదేశీ వస్తువులను వినియోగించాలని సూచించారు. దేశంలోని రుగ్మతలను పారద్రోలి పంచభూతాలను కాపాడాలని, హిందువుల ఐక్యతతో రామమందిర నిర్మాణం జరిగిందని, కశ్మీర్‌లో 370 ఆర్టికల్ రద్దయిందని గుర్తు చేశారు. సేవ, అంకితభావం, వ్యవస్థీకరణ, సాటిలేని క్రమశిక్షణ ఆర్‌ఎస్‌ఎస్‌తోనే సాధ్యమన్నారు. అంతకుముందు పట్టణంలోని వివేకానందకాలనీ నుంచి పురవీధుల్లో కవాతు నిర్వహించారు. కార్యక్రమంలో ఉత్సవ ప్రముఖ్ నాగరాజు, సహ ఉత్సవ ప్రముఖ్ భరత్‌గౌడ్, విశ్వహిందూ పరిషత్ ఉత్సవ సమితి సభ్యులు పాల్గొన్నారు.
ఆర్‌ఎస్‌ఎస్ శతాబ్ది ఉత్సవాలు..
మద్దూరు: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ శతాబ్ది ఉత్సవాలను మంగళవారం మండల కేంద్రంలో ఘనంగా జరుపుకొన్నారు. ముఖ్యఅతిథిగా హిందూవాహిని రాష్ట్ర సంఘటన మంత్రి యాదిరెడ్డి పాల్గొని మాట్లాడారు. ఆర్‌ఎస్‌ఎస్ ఏర్పడి నేటికి వందేళ్లు పూర్తి చేసుకుందని.. క్రమశిక్షణ, సేవ, అంకితభావం, వ్యవస్థీకరణ సంఘానికే సాధ్యమని పేర్కొన్నారు. దేశం కోసం ఎలాంటి సమయంలోనైనా స్వయం సేవకులు పనిచేస్తారని తెలిపారు. కటకం కృష్ణయ్య, సూర్యప్రకాశ్, సత్యనారాయణడ్డి, విజయ్, ప్రశాంత్, రఘు తదితరులతో పాటు 57 మంది సంపూర్ణ గణవేశ్‌లు పాల్గొన్నారు.