
పకడ్బందీగా స్థానిక సంస్థల ఎన్నికలు
● ఎలాంటి పొరపాట్లకు ఆస్కారం ఇవ్వొద్దు
● కలెక్టర్ సిక్తా పట్నాయక్
నారాయణపేట: స్థానిక సంస్థల ఎన్నికలు పకడ్బందీగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ మందిరంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీను, శిక్షణ కలెక్టర్ ప్రణయ్‌కుమార్‌తో కలిసి నోడల్ అధికారుల సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. ఎన్నికల నిర్వహణపై నోడల్ అధికారులు పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. ఎన్నికల విధులు ఎంతో కీలకమైనవని, ఎక్కడా ఏ చిన్న పొరపాటు జరగకుండా జాగ్రత్తగా, సమర్థవంతంగా పని చేయాలని సూచించారు. ఎన్నికల విధులను నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. నగదు, మద్యం పంపిణీపై ప్రత్యేక దృష్టి సారించాలని, నగదు, వస్తువులను సీజ్ చేసిన సమయంలో అన్ని బృందాలు సమన్వయం చేసుకోవాలని సూచించినారు. చెక్‌పోస్టుల్లో వాహన తనిఖీలు నిష్పక్షపాతంగా, పకడ్బందీగా జరిగేలా చూడాలన్నారు. నోడల్ అధికారులు ప్రతిరోజు నివేదికలను నిర్ణీత ఫార్మాట్‌లో సమర్పిచాలని తెలిపారు. ఎన్నికల నిర్వహణలో అధికారుల పాత్ర కీలకమని.. ప్రకటన విడుదలైన నాటి నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తయ్యే వరకు అధికారులు అప్రమత్తంగా ఉంటూ తమకు అప్పగించిన విధులను సమర్థవంతంగా నిర్వర్తించాలని సూచించారు. ఎన్నికల నియమావళిలోని ప్రతి అంశంపై అవగాహన కలిగి ఉండాలని, పొరపాట్లకు ఆస్కారం ఇవ్వొద్దని, అనుమానాలు ఉంటే ఉన్నతాధికారులను సంప్రదించి నివృత్తి చేసుకోవాలని సూచించారు. ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా, నిష్పక్షపాతంగా జరిగేందుకు ప్రతి విభాగానికి నోడల్ అధికారులను నియమించామని, బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలన్నారు. శాంతియుత, స్వేచ్ఛాయుత, పారదర్శక ఎన్నికలకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున అందరూ పాటించాల్సిన నిబంధనలను గుర్తుచేశారు. అధికారులు, సిబ్బంది సమన్వయంతో ముందుకు సాగుతూ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. సమావేశంలో ఎస్‌డీసీ రాజేందర్‌గౌడ్, డీఎస్పీ నల్లపు లింగయ్య, జెడ్పీ సీఈఓ మొగులప్ప, సీపీఓ యోగానంద్, నోడల్ అధికారులు ఎంఏ రషీద్, రహమాన్, వెంకటేష్, సైదులు పాల్గొన్నారు.