
‘పేట’లో చాలా నేర్చుకున్నా
● ఎస్పీ యోగేష్ గౌతమ్
నారాయణపేట: ఉద్యోగ జీవితంలో బదిలీలు సర్వసాధారణమని.. ఎక్కడ, ఎలాంటి విధులు నిర్వర్తించినా కష్టపడి పని చేయాలని పోలీసు అధికారులు, సిబ్బందికి ఎస్పీ యోగేష్ గౌతమ్ సూచించారు. జిల్లాలో సుమారు రెండేళ్లపాటు ఎస్పీగా పని చేసిన యోగేష్ గౌతమ్ బదిలీపై రాజేంద్రనగర్‌కు వెళ్తున్నందున మంగళవారం రాత్రి జిల్లా పోలీసు కార్యాలయంలోని సమావేశ మందిరంలో బదిలీ సన్మాన సభ నిర్వహించారు. కలెక్టర్ సిక్తా పట్నాయక్, అదనపు కలెక్టర్ శ్రీను, శిక్షణ కలెక్టర్ ప్రణయ్, అదనపు ఎస్పీ రియాజ్, డీఎస్పీ నల్లపు లింగయ్య, జిల్లాలోని పోలీసు అధికారులు, సిబ్బంది ఎస్పీని శాలువా, పూలమాలతో సన్మానించి జ్ఞాపిక అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు యోగేష్ గౌతమ్ చాలా తోడ్పాటునందించారని, పోలీసుల సంక్షేమానికి ప్రతి అంశాన్ని చర్చించడంతో పాటు అధునాతన సీసీ కెమెరాల ఏర్పాటు, ట్రాఫిక్ సిగ్నల్స్, ప్రమాదాల నివారణకు స్పీడ్ బ్రేకర్స్ ఏర్పాటుపై చర్చించేవారని వివరించారు. జిల్లాకు సేవలందించి బదిలీపై వెళ్తున్నందున అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. ఎక్కడ విధులు నిర్వర్తించినా ఆయురారోగ్యాలతో ప్రజలకు సేవలు అందించాలని కోరారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. పోలీస్ ఉద్యోగం ఎంతో బాధ్యతాయుతమైందని, జిల్లా నుంచి చాలా విషయాలు నేర్చుకున్నానన్నారు. జిల్లాలో విధులు నిర్వర్తించడంతో ప్రజలతో అవినాభావ సంబంధం ఏర్పడిందని వివరించారు. నేరాల నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణ, పోలీసుల సంక్షేమానికి అనేక కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. అధునాతన పోలీస్‌స్టేషన్లు, ఎస్పీ కార్యాలయంలో అదనపు గదులు, ట్రాఫిక్ సిగ్నల్స్, భరోసా కేంద్రం, వెహికల్స్ వాషింగ్ మెషీన్, డా గ్స్‌కు గదులు నిర్మించామన్నారు. సీఐలు శివశంకర్, రాంలాల్, రాజేందర్‌రెడ్డి, సైదులు పాల్గొన్నారు.