
రైతులపై వివక్ష సరికాదు: బీఆర్‌ఎస్
మక్తల్: రైతులకు అవసరమైన ఎరువులను తక్షణమే సరఫరా చేయాలని, వివక్ష చూపితే సహించే ప్రసక్తే లేదని మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి హెచ్చరించారు. ఆదివారం మండల కేంద్రంలో ఆయన మాట్లాడారు. రైతు సంక్షేమమే ధ్యేయమన్న ప్రభుత్వం.. వారికి కావాల్సిన ఎరువులు సకాలంలో ఎందుకు పంపిణీ చేయడం లేదని ప్రశ్నించారు. యూరియా కొరతతో అన్నదాతలు ఇబ్బందులు పడుతున్నారని.. చెప్పులు, పట్టాదారు పాసు పుస్తకాలను వరుస క్రమంలో పెట్టి పడిగాపులు పడాల్సిన దుస్థితి నెలకొందని తెలిపారు. సాగునీటి ప్రాజెక్టులపై అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం దృష్టి సారించడంతోనే గతంలో కంటే ఈసారి సాగు విస్తీర్ణం పెరిగిందని, ప్రస్తుత ప్రభుత్వానికి ముందుచూపు లేకపోవడంతోనే యూరియా కొరత నెలకొందని చెప్పారు. ఈ ప్రాంతానికి 5,800 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉండగా.. 4,400 మె.ట. వచ్చిందని.. అందులో 3,841 మె.ట. లెక్క చెబుతుండగా, మిగతా యూరియా ఎక్కడికి పోయిందని ప్రశ్నించారు. చిట్టెం కుటుంబానికి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన ఘనత ఉందని.. విమర్శలకు పాల్పడితే అదేస్థాయిల్లో తిరిగి సమాధానం చెప్పడం ఖాయమన్నారు. రైతులకు అవసరమైన ఎరువులు ఇవ్వాలని.. లేనిపక్షంలో బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో మాజీ మార్కెట్ చైర్మన్ నర్సింహగౌడ్, పట్టణ అధ్యక్షుడు చిన్నహన్మంతు, రాములు, మొగులప్ప, అన్వర్, సాగర్, శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు.