
యూరియా కేంద్రాల వద్ద పోలీస్ బందోబస్తు
మరికల్: యూరియా పంపిణీ చేసే కేంద్రాల వద్ద ఎలాంటి ఆటంకాలు చోటుచేసుకోకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించాలని ఎస్పీ యోగేష్ గౌతమ్ సిబ్బందికి సూచించారు. మరికల్ మండలం తీలేర్ సొసైటీ వద్ద జరిగిన ఘటన నేపథ్యంలో ఎస్పీ అక్కడికి చేరుకొని రైతులతో, యూరియా నిల్వలపై ఏఓ రహ్మన్‌తో వేర్వేరుగా ఆరా తీశారు. అనంతరం మాట్లాడుతూ.. ఉదయం నుంచి యూరియా కోసం అధిక సంఖ్యలో రైతులు వచ్చారని, ఇక్కడే జాతీయ రహదారి ఉండటంతో రోడ్డుపై క్యూలో ఉన్న రైతులకు ప్రమాదం జరగకుండా స్థానిక ఎస్‌ఐ టోకెన్లు ఇస్తుండగా ఆయనపైకి రైతులు గుమిగూడి వచ్చారన్నారు. ఈక్రమంలో పరిస్థితి చేయి దాటిపోకుండా ఉండేందుకు ఓ రైతుపై చెయ్యి లేపాడని, ఈ విషయంపై బాధిత రైతు కూడా తనతో మాట్లాడటం జరిగిందన్నారు. తీలేర్ సొసైటీలో యూరియా లేదని పుకార్లు రావడంతో రైతులు అధికసంఖ్యలో యూరియా కోసం వచ్చారని, ఈక్రమంలోనే తోపులాట జరిగిందన్నారు. జిల్లా వ్యాప్తంగా యూరియా పంపిణీ చేసే కేంద్రాల వద్ద ముందు జాగ్రత్త చర్యలు కింద పోలీస్ బందోబస్తు ఏర్పాటుచేయాలని సూచించారు. ఈ విషయంపై కలెక్టర్‌తో కూడా చర్చించామన్నారు. జరిగిన ఘటనపై ఎస్‌ఐపై విచారణ జరిపి క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామన్నారు.