
భూమినే నమ్ముకొని బతుకుతున్నాం..
నారాయణపేట/దామరగిద్ద: భూమినే నమ్ముకొని బతుకుతున్న తమకు న్యాయమైన పరిహారంపై ప్రభుత్వం హామీ ఇవ్వకుండా రైతుల జీవితాలతో చలగాటం అడుతుందని, న్యాయమైన పరిహారం ఇచ్చే వరకు భూములను మాత్రం వదలబోమని భూ నిర్వాసిత రైతులు తేల్చిచెప్పారు. శుక్రవారం పేట – కొడంగల్ ఎత్తిపోతల పథకంలో కాన్‌కుర్తి రెవెన్యూ పరిదిలో సర్వేకు వచ్చిన అధికారులను నిర్వాసితులు అడ్డుకుని ఆందోళనకు దిగారు. పోలీసు బందోబస్తుతో ఆర్డీఓ సమక్షంలో తహసీల్దార్, రెవెన్యూ సిబ్బంది సర్వే చేపట్టేందుకు రాగా రైతులు సర్వే అధికారులను అడ్డుకుంటూ ప్రధాన రహదారిపై రాస్తారోకో చేపట్టారు. ఆర్డీఓ, అదనపు కలెక్టర్ సమదాయించినా ససేమిరా అనడంతో అధికారులు, పోలీసులు అక్కడి నుంచి వెనుదిరిగారు. కాన్‌కుర్తి, గడిమున్కన్‌పల్లి, మల్‌రెడ్డిపల్లి గ్రామాల భూ నిర్వాసిత రైతులు, పాల్గొన్నారు.
నిర్వాసితుల అరెస్టును నిరసిస్తూ ఆందోళన
నారాయణపేట – కొడంగల్ ఎత్తిపోతల పథకం భూనిర్వాసితుల సంఘం నాయకులను అరెస్టును నిరసిస్తూ రైతులు ఆందోళనకు పూనుకున్నారు. శుక్రవారం తెల్లవారుజామున భూనిర్వాసితుల సంఘం జిల్లా గౌరవ అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి ,జిల్లా నాయకులు గోపాల్, బండమీది బలరాం, అంజిలయ్య గౌడ్, మహేష్ కుమార్‌గౌడ్, జోషి, రామకృష్ణను బలవంతంగా అరెస్టు చేసి ధన్వాడ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. విషయం తెలుసుకున్న భూ నిర్వాసితులు అరెస్టులను ఖండిస్తూ ఆర్డీఓ కార్యాలయాన్ని ముట్టడించారు.
హేయమైన చర్య
న్యాయమైన పరిహారం ఇవ్వాలని 44 రోజులకు పైగా ఆందోళన చేస్తున్నా సమస్యలను పరిష్కరించకుండా ప్రభుత్వం అక్రమ అరెస్టులకు పాల్పడడం హేయమైన చర్య అని భూనిర్వాసితుల సంఘం గౌరవ అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి విమర్శించారు. జిల్లా కేంద్రంలోని మున్సిపల్ పార్కు దగ్గర భూ నిర్వాసితులుచేపట్టిన రిలే దీక్ష శిబిరంలో ఆయన మాట్లాడారు. శుక్రవారం తెల్లవారుజామునే పోలీసుల చేత ప్రభుత్వం అరెస్టులకు పాల్పడడం దారుణం అన్నారు. అరెస్టులతో ఉద్యమాన్ని అణచివేయాలని చూస్తే అది మరింత ఉవ్వెత్తున లేస్తదని హెచ్చరించారు.
పరిహారం పెంపుపై స్పష్టత ఇవ్వాలి
‘పేట – కోస్గి’ ఎత్తిపోతల భూ సర్వేను అడ్డుకున్న రైతులు
అక్రమ అరెస్టులకు నిరనసగా ఆందోళన