నారాయణపేట: జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో సిటీ స్కాన్ సేవలను శుక్రవారం ఎమ్మెల్యే డాక్టర్ చిట్టెం పర్ణికారెడ్డి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. ఇకపై సిటీ స్కాన్ కోసం మహబూబ్‌నగర్, హైదరాబాద్ నగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదన్నారు. జిల్లా ఆస్పత్రిలో సిటి స్కాన్ సేవలను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం జరిగిందన్నారు. నిరుపేదలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఎమ్మెల్యేతో పాటు మార్కెట్ చైర్మన్ శివారెడ్డి, కాంగ్రెస్ శ్రేణులు ఉన్నారు.
ప్రతి గణేశ్ మండపానికి జియో ట్యాగ్
నారాయణపేట క్రైమ్: జిల్లాలో మొత్తం 1485 గణేష్ మండపాలకు జియోట్యాగ్ చేయడం జరిగిందని, ఎక్కడ ఎలాంటి సమస్య ఉన్నా వెంటనే డయల్ 100, పోలీస్ కంట్రోల్‌రూం నం.8712670399 కి సమాచారం ఇవ్వాలని ఎస్పీ యోగేష్‌గౌతమ్ అన్నారు. శుక్రవారం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయం వద్ద ఏర్పాటుచేసి వినాయకుడికి ఎస్పీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదానం చేశారు. ఉత్సవాలను సంతోషంగా జరుపుకోవాలని అన్నారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ యండీ రియాజ్ హుల్ హక్, సీఐ శివ శంకర్,ఆర్‌ఐ నరసింహ,ఎస్‌ఐలు వెంకటేశ్వర్లు,నరేశ్,ఆర్మూడ్ రిజర్వ్ పోలీస్,ఎస్‌బి,డీసిఆర్బి, డిపివో, స్టాప్ పాల్గోన్నారు.
రాష్ట్రంలోనే అతిచిన్న జీపీ.. శంకరాయపల్లి తండా
● గ్రామంలో 66మంది ఓటర్లు మాత్రమే
జడ్చర్ల టౌన్: గ్రామపంచాయతీ వార్డుల వారీగా అధికారులు ముసాయిదా ఓటర్ల జాబితాను విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే జడ్చర్ల మండలంలోని శంకరాయపల్లి తండా పంచాయతీలో కేవలం 66 మంది ఓటర్లు మాత్రమే ఉండటం గమనార్హం. 2016–17లో శంకరాయపల్లి తండాను ప్రభుత్వం గ్రామపంచాయతీగా మార్చి అనుబంధ గ్రామంగా శంకరాయపల్లిని చేర్చారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో శంకరాయపల్లి తండాను జడ్చర్ల మున్సిపాలిటీలో విలీనం చేశారు. శంకరాయపల్లి మాత్రం శంకరాయపల్లి తండా జీపీ పేరుతోనే కొనసాగుతోంది. విభజన సమయంలో పక్కనే ఉన్న బండమీదిపల్లిలో శంకరాయపల్లిని విలీనం చేసి ఉంటే సమస్య వచ్చేది కాదు. ప్రస్తుతం అధికారులు విడుదల చేసిన ముసాయిదా జాబితాలో 66మంది ఓటర్లు మాత్రమే ఉన్నారు. దీంతో రాష్ట్రంలోనే అతి చిన్న పంచాయతీగా రికార్డుకెక్కింది. గ్రామంలో మొత్తం 14ఇళ్లు ఉండగా.. 90మంది జనాభా ఉంది. 8 వార్డులు ఉన్నాయి. ఒక్కో వార్డులో 8మంది ఓటర్లు ఉన్నారు. వీరంతా యాదవ కులానికి చెందిన వారే కావడం విశేషం.