
కళాశాలలో ఏసీబీ బృందం తనిఖీలు
నారాయణపేట: జిల్లా కేంద్రంలోని సింగారం చౌరస్తా సమీపంలోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల, కళాశాలలో శుక్రవారం ఉదయం 6.40 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఏసీబీ అధికారుల బృందం ఆకస్మికంగా తనిఖీలు చేపట్టింది. తూనికలు కొలతలు, శానిటేషన్, ఫెడ్ ఇన్‌స్పెక్టర్, అడిట్ అధికారులతో కలిసి ఏసీబీ డీఎస్పీ సీహెచ్ బాలకృష్ణ తనిఖీలు చేపట్టడంతో గురుకుల పాఠశాల సిబ్బంది, అధ్యాపకులు, ఉపాధ్యాయుల్లో ఒకింత ఆందోళన కానవచ్చింది. ఎక్కడైనా తప్పిదం జరిగినట్లు ఏసీబీ అధికారుల దృష్టికి వస్తే ఎవరిపై వేటు పడుతుందోనని భయంతో కనిపించారు. ఉదయం 6.40 గంటలకు చేరుకున్న ఏసీబీ బృందం విద్యార్థులతో మాట్లాడారు. రోజు వారి మెనూ ప్రకారం భోజనం వడ్డిస్తున్నారా, తరగతిగదులు తదితర వసతులపై ఆరా తీశారు. విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను ఏసీబీ బృందానికి వివరించారు. అనంతరం ఏసీబీ డీఎస్పీ స్థానిక విలేకరులతో మాట్లాడుతూ గురుకుల పాఠశాల, కళాశాలలో నిర్వహించిన తనిఖీల్లో తమ దృష్టికి వచ్చిన వాటిని ప్రభుత్వానికి నివేదిస్తామన్నారు. తనతో పాటు వచ్చిన వివిధ విభాగాల అధికారుల బృందం పూర్తి స్థాయిలో తనిఖీలు చేపట్టిందన్నారు. ఆయా శాఖల అధికారుల నివేదికలను ప్రభుత్వానికి పంపించడం జరుగుతుందన్నారు. ఏసీబీ డీఎస్పీతో పాటు ఎస్‌ఐలు జిలానీ, లింగస్వామి, సినియర్ అడిటర్ వెంకట్రాములు, శానిటరీ ఇన్‌స్పేక్టర్ శ్రీనివాస్‌జీ ఉన్నారు.