
‘గండేడ్’లో ఘరానా దొంగ..!
గండేడ్ మండలం రెడ్డిపల్లి గ్రామానికి చెందిన గొల్ల కృష్ణయ్యకు 39/అ/1లో 1.06 ఎకరాల భూమి ఉంది. అతడి తండ్రి మైబయ్య పేరుపై ఇదే సర్వే నంబరులో 0.22 ఎకరాల భూమి ఉంది. మైబయ్య 2013లో మృతిచెందిన తర్వాత విరాసత్ కింద ఆ భూమిని సైతం కృష్ణయ్య తన పేరుపై మార్చుకున్నాడు. మైబయ్య మృతి చెందినప్పుడు రైతు బీమా పథకం లేదు. ఎప్పుడైతే ఆ భూమిని కృష్ణయ్య తన పేరు మీద మార్చుకున్నాడో.. గండేడ్ మండలానికి చెందిన ఓ మోసగాడు రైతు బీమాతో లబ్ధిపొందాలని భావించి తన ప్లాన్‌ను అమలు చేశాడు. సదరు సర్వే నంబర్‌కు బై నంబర్ 39/రుగా మార్చి 4.28 ఎకరాలు ఉన్నట్లు తప్పుడు పత్రాలు సృష్టించాడు. ఆధార్‌కార్డులో మైబయ్య పేరు అలాగే ఉంచి.. అతడి ఫొటోకు బదులు కృష్ణయ్య ఫొటోను మార్ఫింగ్ చేశాడు. డెత్ సర్టిఫికెట్ కూడా తీసుకున్నాడు. అనంతరం మృతి చెందిన మైబయ్య పేరిట రైతుబీమాకు దరఖాస్తు చేశాడు. ఆ డబ్బులు వచ్చాయా.. లేదా అనే దానిపై స్పష్టత లేదు.
..ఇలా ఒక్క కృష్ణయ్య మాత్రమే కాదు. మహబూబ్‌నగర్ జిల్లా గండేడ్, మహమ్మదాబాద్, హన్వాడ మండలాల్లో వందలాది మంది బాధితులు ఉన్నారు. మృతిచెందిన వ్యక్తులు.. వారి కుటుంబాలే టార్గెట్‌గా ఓ వ్యక్తి కొన్నేళ్లుగా మోసాలకు తెగబడ్డాడు. బ్యాంకర్లు, వివిధ ప్రభుత్వ విభాగాల అధికారులు, సిబ్బందితో కుమ్మకై ్క ఈ దందాను కొనసాగించినట్లు తెలుస్తోంది. అమాయక ప్రజలతోపాటు బ్యాంకులు, ప్రభుత్వాన్నీ బురిడీ కొట్టించిన ఘరానా మోసగాడి లీలలపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.. – సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్
రెవెన్యూ సిబ్బంది, బ్యాంకర్ల హస్తం..
గండేడ్, మహబూబ్‌నగర్ జిల్లాకేంద్రంలోని వివిధ బ్యాంకులకు సంబంధించిన అధికారులు, సిబ్బందితో సదరు మోసగాడికి మంచి పరిచయాలు ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. పర్సంటేజీలతో వారిని మచ్చిక చేసుకుని దందా నడిపించినట్లు సమాచారం. అతను తీసుకొచ్చిన వారందరికీ రుణ మంజూరులో బ్యాంకర్లు ఎలాంటి అడ్డంకులు చెప్పకపోవడం అనుమానాలకు తావిస్తోంది. తప్పుడు ధ్రువీకరణ పత్రాలను.. పరిశీలించకుండా రుణాలు మంజూరు చేయడమే ఇందుకు నిదర్శనమని బాధితులు ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించి ప్రైవేట్ బ్యాంకుల్లో కొందరు కిందిస్థాయి సిబ్బంది కీలకపాత్ర పోషించినట్లు సమాచారం. గతంలో పనిచేసిన కొంత మంది రెవెన్యూ సిబ్బంది కూడా దీనికి వంతపాడినట్లు తెలుస్తోంది. కాగా, సదరు మోసగాడి బాగోతాలపై బాధితులు ఇటీవల మహబూబ్‌నగర్ రూరల్ సీఐ గాంధీనాయక్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేశామని.. విచారణ జరుగుతోందని సీఐ తెలిపారు.
ఎలా అంటే..
గొల్ల, కురుమలకు ఆరాధ్య దేవుడి పేరు కలిగిన గండేడ్ మండలానికి చెందిన ఓ వ్యక్తి మృతిచెందిన వారిని లక్ష్యంగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్నాడు. ఇంటి పేరు, లేదా పేరు, లేదా తండ్రి పేరు ఒకటే ఉన్న వారిని ఎంచుకుని మరి వారిని బురిడీ కొట్టిస్తున్నాడు. ఆధార్, రేషన్‌కార్డుల మార్ఫింగ్‌తో మాయాజాలం ప్రదర్శిస్తూ.. సదరు వ్యక్తులపై భూమి లేకున్నా ఉన్నట్లు సృష్టించి బ్యాంకుల్లో రుణాలు, ఇన్సూరెన్స్ సొమ్ము కాజేశాడు. బతికున్న వారి పేరిట తప్పుడు మరణ ధ్రువీకరణ పత్రాలు పుట్టించి.. బతికుండగానే పలువురు రైతుల పేరిట రైతు బీమా పొందినట్లు సమాచారం. అధికారులకు అనుమానం రాగా.. ఒకరిద్దరివి నిలిచిపోయినట్లు ‘సాక్షి’ పరిశీలనలో తేలింది. మోసగాడి వలలో చిక్కి వందలాది మంది అమాయకులు విలవిల్లాడుతున్నారు.
● మృతిచెందిన వారే
టార్గెట్‌గా మోసాలు
● పలువురు బ్యాంకర్లు, ప్రభుత్వ సిబ్బందితో కుమ్మక్కు
● ఆధార్, రేషన్‌కార్డుల
మార్ఫింగ్‌తో మాయాజాలం
● భూమి లేకున్నా ఉన్నట్లు
సృష్టించి స్వాహా పర్వం
● బ్యాంకుల్లో రుణాలు, ఇన్సూరెన్స్ సొమ్ము కాజేత
● బతికున్న వారి పేరిట తప్పుడు డెత్ సర్టిఫికెట్లు..
● రైతు బీమా పొందేందుకూ యత్నాలు
● మోసగాడి వలలో చిక్కి విలవిల్లాడుతున్న అమాయకులు

‘గండేడ్’లో ఘరానా దొంగ..!

‘గండేడ్’లో ఘరానా దొంగ..!