
మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి
నారాయణపేట: మహిళలు వ్యాపార రంగంలో రాణించి పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. వీ హబ్ ఆధ్వర్యంలో జిల్లాలోని స్వయం సహాయక సంఘాల మహిళలు, మహిళా పారిశ్రామికవేత్తలకు ర్యాంప్ ప్రోగ్రాంపై జిల్లా కేంద్రంలో సోమవారం ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. వరల్డ్ బ్యాంక్, కేంద్ర ప్రభుత్వ మినిస్ట్రీ ఆఫ్ ఎంఎస్‌ఎంఈ ఆధ్వర్యంలో చేపడుతున్న ప్రోగ్రాం ద్వారా మహిళల ఆధ్వర్యంలో కొనసాగుతున్న వ్యాపారాలు/ఎంఎస్‌ఎంఈ లకు భరోసా అందనుందన్నారు. రెండు సంవత్సరాల పాటు కొనసాగనున్న ఈ ప్రోగ్రాంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎంపికై న మహిళా పారిశ్రామికవేత్తలకు తమ వ్యాపార అభివృద్ధిని వేగవంతం చేసుకొని ఆదాయాన్ని పెంచుకునే అవకాశం లభిస్తుందని వీ హబ్ డైరెక్టర్ జాహిద్ షేక్ తెలిపారు. దీనిలో భాగంగా టెక్స్‌టైల్స్, ఫుడ్ మ్యానుఫ్యాక్చరింగ్, హస్తకళలు వంటి రంగాల్లోని వ్యాపారులకు బిజినెస్ నైపుణ్యాలపై శిక్షణ, ప్రోడక్ట్ డెవలప్మెంట్ – డైవర్సిఫికేషన్, బ్రాండింగ్ – మార్కెట్ యాక్సెస్, క్రెడిట్ లింకేజ్, ఎక్స్పర్ట్ మెంటరింగ్ మద్దతు అందనుందని వీ హబ్ అసోసియేట్ డైరెక్టర్ ఊహ తెలిపారు. దీనిపై అవగాహన కల్పించి మహిళల నుంచి దరఖాస్తులు తీసుకున్నారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ ప్రణయ్ కుమార్, డీ.ఆర్.డీ.ఓ మొగులప్ప, ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ సాయి రామ్ పాల్గొన్నారు.
జిల్లా సమగ్రాభివృద్ధికి కృషి చేద్దాం
నారాయణపేట రూరల్: జిల్లా సమగ్ర అభివృద్ధికి కృషి చేద్దామని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. నీతి ఆయోగ్ సంపూర్ణ అభియాన్‌లో భాగంగా నర్వ బ్లాక్ చక్కటి పనితీరు కనబర్చడంతో రజత పతకం సాధించి ఇటీవల గవర్నర్ చేతుల మీదుగా కలెక్టర్ అవార్డ్ అందుకున్నారు. ఈ మేరకు సోమవారం ఆమె కార్యాలయంలో స్థానిక టీయూడబ్ల్యూజే (ఐజేయూ) నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి పూలమొక్క అందించి శుభాకాంక్షలు తెలిపారు.
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ధన్వాడ: ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చే రోగులకు వైద్యులు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిని సోమవారం కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఓపీ రోగులతో మాట్లాడారు. అనంతరం అస్పత్రి పరిసరాలను పరిశీలించి అన్ని రకాల వ్యాధులకు మందులు అందుబాటులో ఉన్నాయా లేదా అనే వైద్యులను ప్రశ్నించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ప్రస్తుతం వ్యాధుల సీజన్ కావడంతో వైద్యులు సమయపాలన పాటించి ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు.