
చేనేత కార్మికులకు ఇళ్ల పట్టాలు అందించాలి
నారాయణపేట టౌన్: జిల్లా కేంద్రంలోని మున్సిపల్ పార్కు దగ్గర గాంధీనగర్ చేనేత కార్మికులకు ఇళ్లు రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వాలని, సొసైటీలో కార్మికులకు సభ్యత్వం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సోమవారం కలెక్టర్ కార్యాలయం ఎదుట ఽసీపీఐ మాస్ లైన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం సీడీఈ ప్రకాష్‌కు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ మేరకు సీసీఐ మాస్ లైన్ డివిజన్ కార్యదర్శి కాశీనాథ్ మాట్లాడుతూ.. గాంధీనగర్ కాలనీకి చెందిన వంద మందికి కార్మిక సొసైటీ తరుపున ఇళ్లు నిర్మించి, చేనేత పరికరాలు ఇచ్చి కాలనీ నిర్మించారని, కార్మికుల దగ్గర నెలకు కొంత నగదు వసూలు చేశారన్నారు. సొసైటీ, ప్రభుత్వం నిర్ణయించిన ధర 35 సంవత్సరాల క్రితమే లబ్ధిదారులు చెల్లించినా.. నేటికి ప్రభుత్వం సొసైటీ ఇంటి యాజమానులకు రిజిస్ట్రేషన్ చేయించకుండా ఇబ్బంది పెడుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, సొసైటీ ఇళ్ల పట్టాలను వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేదంటే చేనేత కార్మికులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో జయ, టీయూసీఐ జిల్లా కార్యదర్శి రాము తదితరులు పాల్గొన్నారు.