
యథేచ్ఛగా డీజిల్ దందా!
మరికల్: పక్కనున్న కర్ణాటక రాష్ట్రంలో డీజిల్ ధరలు తక్కువగా ఉండటంతో అక్కడి నుంచి అక్రమంగా జిల్లాకు తీసుకొచ్చి అధిక ధరకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు కొందరు అక్రమార్కులు. వీరితో జిల్లాలోని కొందరు పెట్రోల్‌బంక్ డీలర్లు చేతులు కలపడంతో వీరి వ్యాపారం కాస్తా ‘మూడు పువ్వులు.. ఆరు కాయలు’గా కొనసాగుతోంది. పక్కనే ఉన్న కర్ణాటకలో డీజిల్, పెట్రోల్ ధరలు తక్కువగా ఉండటంతో రాష్ట్ర సరిహద్దులో ఉండే గద్వాల్, నారాయణపేట, మహబూబ్‌నగర్ జిల్లాలోని పెట్రోల్ బంకుల డీలర్లు, కర్ణాటకలో పెట్రోల్‌బంకు డీలర్లతో చేతులు కలిపారు. అక్కడ నుంచి ట్యాంకర్లకు నింపి రాత్రికి రాత్రే సరిహద్దు దాటిస్తున్నారు. అక్కడక్కడ విజిలెన్స్ అధికారులు కేసులు నమోదు చేస్తున్నా.. దందా మాత్రం ఆగడం లేదు.
రోజుకు వేల లీటర్ల తరలింపు
కర్ణాటకలో డీజిల్ ధరలు తక్కువగా ఉండటంతో తెలంగాణ పెట్రోల్‌బంకు నిర్వాహుకులు గత ఐదేళ్ల నుంచి రహస్యంగా ఈ వ్యాపారం కొనసాగిస్తున్నారు. లీటర్‌కు రూ.9 తక్కువగా ఉండటం వల్ల అక్రమంగా డీజిల్‌ను ట్యాంకర్ల ద్వారా గద్వాల్, నారాయణపేట, మక్తల్, మరికల్, కొడంగల్ మీదుగా నిత్యం పదుల సంఖ్యలో ఇతర పట్టణాలకు తరలించ్చి వారి పెట్రోల్‌బంకుల్లో లీటర్ రూ.96.92 విక్రయించి రూ.లక్షలు వెనకేసుకుంటున్నారు. ఇలా ప్రతిరోజు 12 వేల లీటర్ల సామర్థ్యం ఉండే ట్యాంకర్లను 8 నుంచి 10 దాకా తరలిస్తున్నారని సమాచారం. లీటర్‌కు రూ.9 తక్కువగా ఉండటంతో ఒక్కో ట్యాంకర్‌కు రూ.లక్షకు పైగా లాభం వస్తుంది. గతేడాది ఊట్కూర్, మరికల్ మీదుగా వెళ్తున్న రెండు ట్యాంకర్లను సివిల్ సప్లయ్ అధికారులు దాడి చేసి పట్టుకొని కేసులు నమోదు చేశారు. ఈ ఏడాది కూడా నిత్యం కర్ణాటక నుంచి డీజిల్ ట్యాంకర్లు వస్తున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదు. ఇదిలాఉండగా, మరికల్, నర్వ మండలాల సమీపంలోని కొన్ని తండాలకు చెందిన వారు జాతీయ రహదారిపై రాత్రి సమయంలో ఆగిన లారీలు, ట్యాంకర్లను లక్ష్యంగా చేసుకొని ఒక్కో బండి నుంచి 40 లీటర్ల వరకు డీజిల్‌ను దొంగతనం చేస్తుంటారు. ప్రతిరోజు 5 నుంచి 10 వాహనాల్లో ఇలా డీజిల్ లాగేసి మరుసటి రోజు కొందరు ట్రాక్టర్ల యాజమానులకు విక్రయిస్తారు.
తనిఖీలు నిర్వహిస్తున్నాం..
కర్ణాటక నుంచి అక్రమంగా జిల్లాలోకి డీజిల్ ట్యాంకర్లు వస్తే పట్టుకొని యజమానులపై కేసులు నమోదు చేస్తున్నాం. తమ దృష్టికి వచ్చిన ఆయిల్ ట్యాంకర్లను తనిఖీలు చేస్తున్నాం. గడిచిన ఏడాది రెండు కేసులు నమోదు చేశాం. ట్యాంకర్లు పట్టుబడితే అందులో ఉన్న డీజిల్‌ను బట్టి జరిమానా కూడా విధించడం జరుగుతుంది. ఇక డీజిల్ దొంగల విషయం గురించి పోలీసుల దృష్టికి తీసుకెళ్తాం.
– నాగరాజ్, సివిల్ సప్లయ్ అధికారి, నారాయణపేట
నిఘా వైఫల్యమే..
ఇంత పెద్ద ఎత్తున కర్ణాటక నుంచే కాకుండా జాతీయ రహదారులపై ఆగిన లారీల నుంచి డిజీల్ చోరీ చేస్తు సరిహద్దు చెక్‌పోస్టును తప్పించుకొని ఎలా వస్తున్నారు. అక్కడ తప్పించుకున్న జాతీయ రహదారిపై మాగనూరు, మక్తల్, మరికల్, దేవరకద్ర, మహబూబ్‌నగర్ పోలీస్‌స్టేషన్లు ఉన్నాయి. దీంతో పాటు జాతీయ రహదారిపై నిత్యం 24 గంటల పాటు పెట్రోలింగ్ నిర్వహించే పోలీస్ వాహనాలు ఉన్నా వీరు డిజిల్ కార్లు, ట్యాంకర్లను ఎలా తరలిస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికై నా అధికారులు స్పందించి అటు అక్రమంగా డీజిల్ తరలిస్తున్న వారిపై, ఇటు వాహనాల్లో డీజిల్ దొంగతనం చేసే వారిని పట్టుకొని కేసులు నమోదు చేయాలని పలువురు కోరుతున్నారు.
కర్ణాటక నుంచి జిల్లాకు
అక్రమంగా తరలిస్తున్న వైనం
అక్కడ లీటర్ రూ. 87.. ఇక్కడ రూ.96
రాత్రికి రాత్రే సరిహద్దు దాటుతున్న ట్యాంకర్లు

యథేచ్ఛగా డీజిల్ దందా!