
బలవంతపు భూసేకరణ నిలిపివేయాలి
ఊట్కూరు: బలవంతపు భూసేకరణను నిలిపివేయాలని సోమవారం అఖిలపక్ష నాయకులు డిమాండ్ చేశారు. ఊట్కూరులోని ఆర్యసమాజ్ భవనంలో భూ నిర్వాసితులతో కలిసి అఖిలపక్ష నాయకులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ జెడ్పీటీసీ అరవింద్‌కుమార్, మాజీ సర్పంచ్ ఎం భాస్కర్ మాట్లాడుతూ నారాయణపేట, కొడంగల్ ప్రాజెక్ట్‌లో భూములు కోల్పోతున్న రైతులను ఆదుకోవాల్సింది పోయి భయబ్రాంతులకు గురి చెయ్యడం తగదని ఆరోపించారు. గత నెల రోజుల క్రితం పోలీసు పహారాలో భూసేకరణ చేపట్టిందని, సర్వే చేసేటప్పుడు రైతులు సమస్యలు చెప్పుకోవడానికి కూడా అవకాశం కలిపించలేదని ఆరోపించారు. భూములు కోల్పోతున్న రైతులకు ఎకరాకు రూ.14 లక్షలు అందించడం తగదని మార్కెట్ ధర రూ.50లక్షల నుంచి రూ.60 లక్షల వరకు పలుకుతుందని అన్నారు. నిర్వాసితులకు నష్టపరిహారం ఇప్పించడంలో జిల్లా మంత్రి విఫలమయ్యారని ఆరోపించారు. రైతులు నెల రోజులుగా శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న ఎవరూ పట్టించుకోవడం లేదని రైతులకు న్యాయమైన పరిహారం అందేవరకు అఖిలపక్షం ఆధ్వర్యంలో పోరాటాలు చేసేందుకు సిద్ధమైనట్లు వారు తెలిపారు. ఈ నెల 6వ తేదీ నుంచి పాదయాత్రలో నిరసన కార్యక్రమాలు చేపడుతామని తెలిపారు. సమావేశంలో బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు లక్ష్మారెడ్డి, చంద్రశేకర్‌గౌడ్, మాజి ఎంపీటీసీ హనుమంతు, వెంకటరామారెడ్డి, శివారెడ్డి, మోనప్ప, ధర్మరాజు, ఇబాదూర్‌రహమాన్ తదితరులు పాల్గొన్నారు.