
నిత్యం.. కలకలం
జనావాసాల్లోకి చిరుతలు
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: ఇటీవల వీరన్నపేట, మొన్న టీడీగుట్ట, చౌదర్‌పల్లి, నిన్న మొగుళ్లపల్లి.. ఇలా జిల్లాలో నిత్యం ఏదో ఒక్క చోట చిరుతలు దర్శనమిస్తూనే ఉన్నాయి. ఎక్కడో అటవీ ప్రాంతంలో అవి కనపడుతున్నాయని అనుకుంటే పరవాలేదు. కానీ జనావాసాల పరిధిలోనే దర్శనమిస్తుండడంతో ప్రజలు హడలెత్తుతున్నారు. సుమారు నెల రోజులుగా ఆయా ప్రాంతాల వారికి కంటి మీద కునుకు లేకుండా పోయింది. అయితే చిరుత పులులు కనపడడం.. తదితర చోట్ల గొర్లు, మేకలు, పశువులపై దాడి చేసిన ఘటనలే ఇప్పటివరకు ఉన్నాయి. తాజాగా కోయిల్‌కొండ మండలం కొత్లాబాద్, హన్వాడా మండలం రామన్నపల్లి శివారులో ముగ్గురిపై చిరుత దాడి చేసిన నేపథ్యంలో ప్రజల్లో మరింతగా భయాందోళనలు నెలకొన్నాయి.
● పట్టణ, మండల శివార్లలోని గుట్టల్లో ఆవాసం
● రోజుకో చోట దర్శనం.. గొర్రెలు, మేకలు, పశువులపై దాడి
● ఒక్క మహబూబ్‌నగర్ జిల్లాలో 15 నుంచి
18 వరకు చిరుతలు
● ఫలితం లేని అధికారుల
ఆపరేషన్.. భయంభయంగా ప్రజల జీవనం
● కొత్లాబాద్‌లో ముగ్గురిపై దాడితో స్థానికుల్లో ఆందోళన
మహబూబ్‌నగర్ జిల్లాకు సంబంధించి మహబూబ్‌నగర్ రేంజ్ పరిధిలో 19,132 హెక్టార్లు, మహమ్మదాబాద్ రేంజ్ పరిధిలో 7,852 హెక్టార్ల విస్తీర్ణంలో అడవులు విస్తరించి ఉన్నాయి. ఈ ఫారెస్ట్‌లో ప్రస్తుతం 15 నుంచి 18 వరకు చిరుతలు ఉన్నట్లు సంబంధిత అధికారులు అంచనా వేస్తున్నారు. మహబూబ్‌నగర్ పట్టణంతో పాటు పలు మండలాలు, గ్రామాలను ఆనుకుని సహజసిద్ధంగా గుట్టలు ఉండగా.. వాటిని చిరుత పులులు ఆవాసాలుగా ఏర్పరచుకున్నాయి.
ముగ్గురిపై దాడితో బీ అలర్ట్..
కొత్లాబాద్ శివారులో గొర్రెల కాపరితో పాటు మరో ఇద్దరు రైతులపై చిరుత దాడి నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. సాధారణంగా ప్రజలపై అవి దాడికి దిగవని.. సదరు వ్యక్తులు కుక్క అనుకుని టార్చిలైట్ వేయడం, తరముతున్న క్రమంలో చిరుత దాడికి దిగినట్లు తెలుస్తోందని వెల్లడించారు. అయితే ప్రస్తుతం వ్యవసాయ సీజన్ కావడంతో గుట్టల పరిసరాల్లో పొలాలకు వెళ్లేందుకు రైతులు జంకుతున్నారు. అదేవిధంగా గుట్టల పరిసరాల్లో నివసిస్తున్న ప్రజలు నిత్యం భయాందోళనల మధ్య సాయంత్రం కాగాలే ఇళ్లకు తలుపులేసి భయం భయంగా కాలం వెళ్లదీస్తున్నారు.
ఆహారం దొరక్క జనావాసాల్లోకి..
ప్రధానంగా అడవి పందులు, అడవి కుందేళ్లు, నెమళ్లు ఇతరత్రా వన్యప్రాణులతో పాటు అక్కడక్కడా నీటి సదుపాయం ఉండడం.. జూన్ నుంచి ఆగస్టు వరకు సంపర్క సమయం కావడంతో ఆయా గుట్టల ప్రాంతాల్లో చిరుతలు నివాసం ఏర్పరుచుకున్నట్లు తెలుస్తోంది. ఇందుకు వీరన్నపేట–టీడీగుట్ట మధ్య ఉన్న గుర్రంగట్టు గుట్టపై, ధర్మాపూర్ సమీపంలోని చౌదర్‌పల్లి గుట్టపై, నవాబుపేట మండలంలోని మొగుళ్లపల్లి గుట్టపై చిరుతలు కనిపించడమే నిదర్శనం. ఈ క్రమంలో ఆహారం దొరకనప్పుడు గుట్టల సమీపంలోని నివాస ప్రాంతాల్లో గొర్రెలు, మేకలు, పశువుల మందలపై దాడులు చేస్తున్నాయి.
ఫలితం లేని ఆపరేషన్..
ఆయా ప్రాంతాల్లో జిల్లా అధికార యంత్రాంగం చేపట్టిన ఆపరేషన్ చిరుతతో ఎలాంటి ఫలితం లేకుండా పోయింది. మహబూబ్‌నగర్‌లోని వీరన్నపేట, టీడీగుట్ట మధ్య ఉన్న గుర్రంగట్టుపై జూన్ 30న చిరుత మొదటిసారిగా కనిపించింది. ఆ తర్వాత ఈ నెల రెండో తేదీన మళ్లీ దర్శనమిచ్చింది. ఈ నేపథ్యంలో కలెక్టర్, విజయేందిర బోయి, ఎస్పీ జానకి స్వయంగా ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. కలెక్టర్ ఆదేశాలతో ఆ ప్రాంతంలో ముందుగా రెండు, ఆ తర్వాత మరో రెండు బోన్లు ఏర్పాటు చేశారు. తెల్లారి అదే గుట్టపై ఒకేసారి రెండు చిరుతలు కనపడ్డాయి. కానీ.. ఇప్పటివరకు అవి చిక్కలేదు. దీంతో ప్రత్యేక బృందాలను ఏర్పా టు చేసి గస్తీ నిర్వహించాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం అచ్యుతాపూర్‌లో చిరుత ముగ్గురిపై దాడి చేయగా.. ముందు రోజే ఆ గ్రామ సమీపంలోని కొత్లాలాబాద్‌లో బోన్ ఏర్పాటు చేశారు. అయినా ఫలితం లేకపోగా.. ముగ్గురిపై దాడి నేపథ్యంలో స్థానికుల్లో భయాందోళనలు నెలకొన్నాయి.
అన్ని చోట్ల కెమెరాలతోపాటు బోన్లు ఏర్పాటు చేశాం..
జూన్ నుంచి ఆగస్టు వరకు చిరుతల సంపర్కానికి అనుకూల సమయం. ప్రస్తుతం అవి జనావాసాల్లోకి రావడానికి కారణాలు అంతుచిక్కడం లేదు. ఆహారం, నీరు సమృద్ధిగా దొరకనప్పుడే అవి నివాసిత ప్రాంతాలకు వస్తాయి. చిరుతలు అనుకోని సందర్భాల్లో తప్ప మనుషులపై దాడి చేసిన ఘటనలు చాలా తక్కువ. గుట్టల సమీప ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. పిల్లలను ఒంటరిగా వదిలేయొద్దు. ఎక్కడికి వెళ్లినా గుంపులుగానే పోవాలి. వాటిని బంధించేందుకు అన్ని చోట్ల బోన్లు ఏర్పాటు చేశాం. కెమెరాలతో నిత్యం పర్యవేక్షిస్తున్నాం.
– సత్యనారాయణ, డీఎఫ్‌ఓ, మహబూబ్‌నగర్
చిరుత జాడ లేకుండా ఏ ఒక్క నెల లేదు..
చిరుతల సంచారంతో వణికిపోతున్నాం. వ్యవసాయ పనులకు వెళ్లాలంటే భయమైతాంది. సాయంత్రం అయ్యిందంటే చాలు.. ఊరంతా తలుపులేసుకుని ఇంట్లోనే ఉంటున్నారు. చిరుత జాడ లేకుండా కనీసం ఏ ఒక్క నెల లేదు. గత నెలలో మా గ్రామంలోని ఓ రైతుకు చెందిన పశువుల పాకలో కట్టేసిన లేగదూడను చిరుత ఎత్తుకుని వెళ్లి రక్తం తాగి పడేసింది. – రవి, మొగుళ్లపల్లి, నవాబుపేట
●
వామ్మో.. చిరుత
జిల్లాలో 15
నుంచి 18 వరకు..

నిత్యం.. కలకలం

నిత్యం.. కలకలం