
భూ నిర్వాసితులకు అన్యాయం
నారాయణపేట: పేట–కొడంగల్ ఎత్తిపోతల పథకం భూ నిర్వాసితులకు ప్రభుత్వం న్యాయమైన పరిహారం చెల్లించకుండా అన్యాయం చేస్తోందని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.సాగర్ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలో భూ నిర్వాసితులు చేపట్టిన రిలే దీక్షలకు ఆయన మద్దతు ప్రకటించి మాట్లాడారు. ఎకరాకు రూ. 14లక్షల పరిహారం ఇవ్వడం ఆమోదయోగ్యం కాదని రైతులు ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నా ప్రభుత్వం పట్టించుకోకుండా బలవంతంగా భూ సేకరణ చేపట్టడం మంచిది కాదన్నారు. చట్టం ప్రకారం రైతులకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రిగా ఈ ప్రాంతవాసి రేవంత్‌రెడ్డి ఉన్నప్పటికీ రైతులకు మేలు జరగడం లేదని.. ఉద్యమాలు తప్పడం లేదన్నారు. భూ నిర్వాసితుల విషయంలో ప్రభుత్వ పెద్దలు పెద్ద మనసుతో ఉండాల్సింది పోయి.. పంతానికి పోవడం, రైతులను ప్రలోభాలకు గురిచేయడం, ఆర్డీఓ స్థాయి అధికారితో బెదిరింపులకు పాల్పడటం మంచిదికాదన్నారు. ఎద్దు ఏడిసిన వ్యవసాయం.. రైతు ఏడిసిన రాజ్యం బాగుపడదనే విషయం గుర్తెరిగి వ్యవహరించాలని కోరారు. కార్యక్రమంలో భూ నిర్వాసితుల సంఘం జిల్లా గౌరవాధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి, అధ్యక్షుడు మశ్చందర్, ఉపాధ్యక్షుడు ధర్మరాజుగౌడ్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి గోపాల్, సీఐటీయూ జిల్లా కార్యదర్శి బాల్‌రాం తదితరులు పాల్గొన్నారు.