
సరికొత్తగా సైబర్ మోసాలు
నారాయణపేట క్రైం: సైబర్ నేరగాళ్లు సరికొత్తగా మోసాలకు పాల్పడుతున్నారని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ యోగేష్ గౌతమ్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. విలాసవంతమైన వస్తువులు, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేస్తామని రకరకాల మాయమాటలతో మభ్యపెట్టి మోసాలకు పాల్పడుతున్నారన్నారు. ప్రధానంగా గొలుసుకట్టు వ్యాపారాలకు తెరలేపుతున్నారని తెలిపారు. ప్రస్తుతం సైబర్ నేరాలు చోటు చేసుకుంటున్న తీరు, సైబర్ నేరాలకు ప్రజలు గురవుతున్న విధానాలపై ప్రతి ఒక్కరూ అవగాహనతో జాగ్రత్త పడాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. మొబైల్ లేదా సోషల్ మీడియా ప్లాట్ ఫామ్‌లో అనేక కంపెనీల పేర్లతో లింక్‌లు పంపిస్తూ మోసాలకు గురిచేస్తున్నట్లు తెలిపారు. అపరిచిత వ్యక్తుల మాటలు నమ్మి మోసపోవద్దని సూచించారు. ఎవరైనా సైబర్ నేరగాళ్ల బారినపడి మోసపోతే వెంటనే డయల్ 1930 లేదా సమీపంలోని పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని తెలిపారు.
పెండింగ్ బిల్లులు
చెల్లించండి
కోస్గి: ఉద్యోగ, ఉపాధ్యాయులకు పీఆర్సీ ప్రకటించి.. అన్ని డీఏలతో పాటు పెండింగ్ బిల్లులు చెల్లించాలని తపస్ జిల్లా అధ్యక్షుడు కృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం గుండమాల్, కోస్గి మండలాల్లో ఆ సంఘం నాయకులతో ఆయన సమావేశమై మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయ పదోన్నతుల ప్రక్రియ ప్రారంభించడాన్ని స్వాగతిస్తున్నామని చెప్పారు. గతంలో కొందరు భాషా పండిట్‌లు, పీఈటీలను అప్‌గ్రేడ్ చేయలేదన్నారు. మిగిలిన వారికి పదోన్నతులు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. జీఓ 317 బాధితులకు న్యాయం చేయాలని, డీఎస్సీ 2008 కాంట్రాక్ట్ టీచర్లకు ప్రతినెలా వేతనాలు చెల్లించాలని కోరారు. మోడల్ స్కూల్, కేజీబీవీ ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం చొరవ చూపాలన్నారు. సమావేశంలో ఆ సంఘం జిల్లా గౌరవాధ్యక్షుడు మల్లికార్జున్, కార్యదర్శి అంజిలయ్య, ఆయా మండలాల ప్రతినిధులు పరందాములు, వెంకట్రాములు, ఆంజనేయులు, రాఘవేందర్, వెంకటేశ్, అర్జున్, చంద్రమౌళి, రవితేజ, సత్య కుమార్ తదితరులు ఉన్నారు.