
ఎరువు.. బరువు!
మరికల్: రాయితీ ఎరువుల ధరలను సంబంధిత కంపెనీలు అనూహ్యంగా పెంచాయి. 28–28–0, డీఏపీ, యూరియా మినహా మిగతా వాటి ధరలు రూ. 50 నుంచి రూ. 330 వరకు పెంచి రైతులపై ఎనలేని భారాన్ని మోపాయి. ఏటేటా పెరుగుతున్న ధరల కారణంగా రైతులకు పంటసాగు భారంగా మారుతోంది. జిల్లాలో వానాకాలం సాగుచేసే వివిధ రకాల పంటలకు 70కి పైగా మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరమవుతుండగా.. పెరుగుతున్న ధరలు రైతుల నడ్డి విరుస్తున్నాయి. ఇదిలా ఉంటే, యూరియా, డీఏపీ ధరల పెంపునకు ప్రభుత్వం అనుమతులు ఇవ్వలేదు. ఈ రెండింటి అమ్మకాలకు ఆయా కంపెనీలు లింకు ఎరువులను రైతులకు అంటగడుతున్నాయి. లేకపోతే యూరియా, డీఏపీలను విక్రయించబోమని జిల్లాలోని వివిధ మండలాల్లో ప్రైవేటు ఎరువుల డీలర్లు తేల్చి చెబుతున్నారని రైతులు వాపోతున్నారు.
నానో యూరియాపై అనాసక్తి..
మారుతున్న కాలానికి అనుగుణంగా పంటల సాగు చేపడితే మేలు చేకూరుతుందనే ఉద్దేశంతో ప్రభుత్వం యూరియా స్థానంలో నానో యూరియాను ద్రవరూపంలో తీసుకొచ్చింది. ధర తక్కువగా ఉండే నానో ఎరువుల వినియోగంతో రైతులకు పెట్టుబడుల భారం తగ్గి.. దిగుబడులు పెరుగుతాయని వ్యవసాయశాఖ నిపుణులు అంటున్నారు. రెండేళ్ల క్రితమే నానో యూరియా మార్కెట్‌లోకి వచ్చినప్పటికీ.. రైతులు మాత్రం ఆసక్తి చూపలేకపోతున్నారు. ప్రస్తుతం వాడుతున్న సాధారణ యూరియాను పంటకు చల్లడం ద్వారా కేవలం 30 శాతం మాత్రమే పంటకు వెళ్తుందని అధికారులు పేర్కొంటున్నారు. అదే నానో యూరియా 80 శాతం పంటకు వెళ్తుందని చెబుతున్నారు. అర లీటర్ డబ్బాలో లభించే నానో యూరియా 45 కిలోల బస్తాతో సమానం. రాయితీ పోను యూరియా బస్తా ధర రూ. 266 ఉండగా, నానో యూరియా రూ. 240కే లభిస్తుంది. యూరియా తర్వాత రసాయన నానో డీఏపీని అందుబాటులోకి తెచ్చారు. ఒక బస్తా డీఏపీ 500 మిల్లీ లీటర్ల నానో డీఏపీతో సమానం. బస్తా డీఏపీ ధర రూ. 1,350 ఉండగా.. నానో డీఏపీ రూ. 600కే లభిస్తుంది. అయితే నానో ఎరువుల వినియోగంతో కలిగే లాభాలపై రైతులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించడం లేదనే విమర్శలు ఉన్నాయి.
ఎరువులు
యూరియా, డీఏపీ మినహా అన్ని రకాల ఎరువుల రేట్లు పెంపు
ఏటేటా పెరుగుతున్న ధరలతో
రైతులకు పెట్టుబడి భారం
నానో ఎరువుల వినియోగంపై అవగాహన కరువు
జిల్లావ్యాప్తంగా 4.20 లక్షల ఎకరాల్లో వానాకాలం సాగు అంచనా