
దివ్యాంగులకు రుణాలు
నారాయణపేట: జిల్లాలోని దివ్యాంగులకు ఆర్థిక ప్రోత్సాహక పథకం కింద జీవనోపాధి అవకాశాలు కల్పించేందుకు గాను రుణాలు మంజూరు చేయనున్నట్లు జిల్లా సంక్షేమశాఖ అధికారి, అడిషనల్ కలెక్టర్ సంచిత్ గంగ్వార్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాకు 100 శాతం రాయితీతో రూ. 50వేల చొప్పున 14 యూనిట్లు, 80 శాతం రాయితీతో రూ. లక్ష విలువైన ఒక యూనిట్, 70 శాతం రాయితీతో రూ. 2లక్షల విలువైన ఒక యూనిట్, 60శాతం రాయితీతో రూ. 3లక్షల విలువగల ఒక యూనిట్ మంజూరు చేయనున్నట్లు పేర్కొన్నారు. అర్హులైన దివ్యాంగులు ఈ నెల 31వ తేదీలోగా https://tgobmms. cgg.gov.in/ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
పార్టీలకతీతంగా
ఏకం కావాలి
కోస్గి: రాష్ట్ర జనాభాలో 20 శాతం ఉన్న యాదవులను పార్టీలు ఓటు బ్యాంకుగానే వాడుకుంటున్నాయని.. రాజకీయాలు పక్కనబెట్టి పార్టీలకతీతంగా యాదవ కులస్తులంతా ఏకమైతేనే రాజకీయ, సామాజిక, ఆర్థిక రంగాల్లో సమగ్రాభివృద్ధి సాధిస్తారని యాదవ హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షుడు రాములు యాదవ్ అన్నారు. మంగళవారం పట్టణంలో ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు గుర్రం హన్మంతు యాదవ్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం యాదవ కులానికి ప్రాధాన్యతనిచ్చి మంత్రివర్గంలో చోటు కల్పించడంతో పాటు నలుగురికి ఎమ్మెల్సీగా, మరో నాలుగు నామినేటెడ్ పదవులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇందుకోసం అవసరమైతే ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద నిరాహార దీక్ష చేపడతామన్నారు. సమావేశంలో ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దేవేందర్ యాదవ్, వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ యాదవ్, జిల్లా గౌరవాధ్యక్షుడు పీరంపల్లి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి మల్లేష్, వర్కింగ్ ప్రెసిడెంట్ గంటల రమేశ్, కోస్గి మండల అధ్యక్షుడు మోహన్ ఉన్నారు.
చేనేత ఉత్పత్తుల
సంఘానికి అవార్డు
అమరచింత: అమరచింత చేనేత ఉత్పత్తుల సంఘాన్ని ఉత్తమ సంఘంగా ఎంపిక చేసి జౌళిశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావు చేతుల మీదుగా కంపెనీ సీఈఓ చంద్రశేఖర్‌కు అవార్డును అందించారు. నాబార్డు ఏర్పడి నేటికి 44 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా హైదరాబాద్‌లో మంగళవారం నాబార్డ్ ఆధ్వర్యంలో అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అమరచింత చేనేత ఉత్పత్తుల సంఘం సీఈఓ చంద్రశేఖర్ మాట్లాడుతూ ఆరేళ్లుగా సంఘాన్ని కొనసాగిస్తూ చేనేత కార్మికులే కంపెనీ షేర్ హోల్డర్స్‌గా నియమించడంతో పాటు వచ్చిన లాభాల్లో అందరికీ సమాన వాటా ఇస్తున్నామని తెలిపారు. తమ కృషిని గుర్తించి నాబార్డు రాష్ట్ర స్థాయిలో ఉత్తమ సంఘంగా ఎంపిక చేసి అవార్డు ఇవ్వడం సంతోషకరమన్నారు. కార్యక్రమంలో నాబార్డ్ సీజీఎం ఉదయభాస్కర్, టీజీ క్యాబ్ చైర్మన్ రవీందర్ తదితరులు పాల్గొన్నారు.
నిరుద్యోగ యువతకు
ఉచిత కోచింగ్
గద్వాల: జిల్లాలోని డిగ్రీ పూర్తి చేసిన బీసీ నిరుద్యోగ యువతకు గ్రూప్స్, ఆర్‌ఆర్‌బీ, ఎస్‌ఎస్‌సీతోపాటు బ్యాంకింగ్ సర్వీసులకు టీజీ బీసీ స్టడీ సర్కిల్ ద్వారా ఉచిత కోచింగ్ ఇవ్వనున్నట్లు టీజీ బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ రాములు ఒక ప్రకటనలో తెలిపారు. అనుభవజ్ఞులైన అధ్యాపకులచే 5 నెలలు కోచింగ్ ఇవ్వబడుతుందని, అర్హత గల బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ అభ్యర్ధులు ఆన్‌లైన్ వెబ్‌సైట్ https://studycircle.cgg.gov.in నందు ఈ నెల 16 నుంచి ఆగస్టు 11వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. శిక్షణ తరగతులు ఆగస్టు 25 నుంచి ప్రారంభమవుతాయని, కోచించ్ సమయంలో నెలకు రూ.వెయ్యి స్టైఫండ్ ఇవ్వబడునని తెలిపారు. అభ్యర్థుల తల్లిదండ్రుల వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాలలో రూ.1.50 లక్షలలోపు పట్టణ ప్రాంతం వారికి రూ.2 లక్షల లోపు ఉండాలని, నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

దివ్యాంగులకు రుణాలు