
న్యాయమైన పరిహారం అందివ్వాలి
నారాయణపేట: మక్తల్, నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పథకం భూ నిర్వాసితులకు బహిరంగ మార్కెట్ ధరకు అనుగుణంగా నష్ట పరిహారం అందివ్వాలని కోరుతూ గత నాలుగు రోజులుగా జిల్లా కేంద్రంలోని మున్సిపల్ పార్కు దగ్గర రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. శుక్రవారం భూనిర్వాసితుల సంఘం గౌరవ అధ్యక్షుడు, వెంకట్రామిరెడ్డి జిల్లా అధ్యక్షుడు మశ్చందర్, సిఐటీయూ జిల్లా కార్యదర్శి బాల్‌రాం దీక్ష చేపట్టిన భూ నిర్వాసితులకు పూలమాలలు వేసి మాట్లాడారు. అన్ని విధాలుగా వెనుకబాటుకు గురైన మన ప్రాంతానికి ప్రాజెక్టు తప్పనిసరి కాని ప్రాజెక్టు కోసం భూములిస్తున్న భూ నిర్వాసితులకు న్యాయమైన పరిహారం అందివ్వాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ప్రభుత్వం ప్రకటించిన రూ.14 లక్షల పరిహారం ఆమోదయోగ్యం కాదన్నారు. ఆ డబ్బుతో ఎకరం భూమి ఎక్కడ కూడా కొనలేని పరిస్థితి ఉందన్నారు. ప్రాజెక్టుతో నీటి వసతి పెరగడం వలన భూముల ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉందన్నారు. మార్కెట్ ధర ప్రకారం బేసిక్ ధర నిర్ణయించి దానికి మూడు రెట్లు పెంచి ఇవ్వాలని డిమాండ్ చేశారు. అప్పుడే 2013 భూ సేకరణ చట్టాన్ని అమలు చేసిన వాళ్లమవుతామన్నారు. ఈ దీక్షలను రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యే డాక్టర్ చిట్టెం ఫర్నీకరెడ్డి సందర్శించి రైతులకు న్యాయమైన పర్యాయం అందే విధంగా చూడాలని కోరారు. కార్యక్రమంలో కాశప్ప, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.