
విద్యాశాఖలో పోస్టులు భర్తీ చేయాలి
నారాయణపేట రూరల్: విద్యాశాఖలో ఖాళీగా ఉన్న పర్యవేక్షణ అధికారుల పోస్టులు భర్తీ చేయాలని పీడీఎస్‌యూ జిల్లా ఉపాధ్యక్షుడు గౌస్ డిమాండ్ చేశారు. పట్టణంలోని ప్రభుత్వ గ్రౌండ్ స్కూల్ ఎదుట ఆ సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ.. కొత్తగా ఏర్పాటు చేసిన జిల్లాల్లో డీఈఓ పోస్టులను మంజూరు చేసి వాటి స్థానంలో రెగ్యూ లర్ అధికారులను నియమించాలని, ఎంఈఓ, సీఆర్పీలతో నిరంతరం మండల పర్యవేక్షణ చేయించాలన్నారు. చాలా చోట్ల ఒకే గదిలో ఐదు తరగతులు నిర్వహిస్తున్న పీఎస్ లకు అదనపు గదులను మంజూరు చేసి యుద్ధ ప్రాతిపదికన నిర్మించాలని డిమాండ్ చేశారు. మౌలిక వసతుల విషయంలో తగిన చర్యలు చేపట్టి మరుగుదొడ్లు, మూత్రశాలలు, తాగునీరు ఏర్పాటు చేయాలన్నారు. మధ్యాహ్న భోజన విషయంలో నాణ్యత పాటించేవిధంగా, మెనూ ప్రకారం అందించే చర్యలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో నాయకులు వెంకటేష్, మహేష్, గణేష్ పాల్గొన్నారు.