
ప్రజావాణి అర్జీల పరిష్కారానికి ప్రాధాన్యం
నారాయణపేట: వివిధ సమస్యలపై ప్రజావాణి కార్యక్రమంలో వచ్చే ఫిర్యాదులకు ప్రాధాన్యతనిస్తూ వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో 52 ఫిర్యాదులు అందాయి. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. అర్జీలను పెండింగ్‌లో ఉంచకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం వహించొద్దన్నారు. సమస్యల పరిష్కారానికి చేపట్టిన చర్యలను వివరిస్తూ అర్జీదారులకు సమాచారం తెలియజేయాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్, ట్రెయినీ కలెక్టర్ ప్రణయ్‌కుమార్ పాల్గొన్నారు.
ఓపెన్ స్కూల్‌ను సద్వినియోగం చేసుకోవాలి
చదువుకు దూరమైన వారికి ఓపెన్ స్కూల్ వరంలా ంటిదని.. మధ్యలో చదువు మానేసిన వారు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. కలెక్టరేట్‌లో విద్యాశాఖ అధికారులతో కలిసి తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ పోస్టర్‌ను కలెక్టర్ ఆవిష్కరించి మాట్లాడారు. వ్యాపార రంగాల్లో ఉన్నవారితో పాటు ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు, వివిధ సంఘాల సభ్యులు, సామాజికంగా, ఆర్థికంగా వెనకబడిన వర్గాల వారు ఓపెన్ స్కూల్ ద్వారా ఎస్‌ఎస్‌సీ, ఇంటర్ విద్య పూర్తిచేసేందుకు సువర్ణావకాశమని అన్నారు. ఓపెన్ స్కూల్‌లో అడ్మిషన్ పొందిన వారికి సెలవు దినాల్లో మాత్రమే తరగతులు నిర్వహిస్తారన్నారు. ఉచితంగా పాఠ్యపుస్తకాలు అందించనున్నట్లు తెలిపారు. మహిళలు, దివ్యాంగులు, ట్రాన్స్‌జెండర్లు, మాజీ సైనిక ఉద్యోగుల పిల్లలకు ఫీజు రాయితీ ఉంటుందన్నారు. అదే విధంగా ఉల్లాస్ నవభారత సాక్షారత కార్యక్రమంలో భాగంగా నిరక్షరాస్యులు కనీసం చదవడం, రాయడం, అంకెలు గుర్తించడం, కనీస సామర్థ్యాలతో కూడిన లెక్కలు చేయడం విధానాలతో అక్షరాస్యత కార్యక్రమం అమలు చేస్తున్నట్లు తెలిపారు. అందులో భాగంగా బడి మానేసిన వారిని గుర్తించి తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీలో అడ్మిషన్ కల్పించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. డీఈఓ గోవిందరాజులు, జిల్లా టాస్ కోఆర్డినేటర్ శ్రీనివాస్, ఏఎంఓ విద్యాసాగర్, ఎంఈఓ బాలాజీ, డీఎస్‌ఓ భానుప్రకాశ్ పాల్గొన్నారు.