
గ్రామాల అభివృద్ధిలో కార్యదర్శుల పాత్ర కీలకం
నారాయణపేట: గ్రామాల అభివృద్ధిలో పంచాయతీ కార్యదర్శుల పాత్ర కీలకమని ఇన్‌చార్జి డీపీఓ పి.సుధాకర్‌రెడ్డి అన్నారు. స్థానిక డీఎంహెచ్‌ఓ కార్యాలయ కాన్ఫరెన్స్ హాల్‌లో మంగళవారం భారత ప్రభుత్వం పరిపాలన సంస్కరణలు, ప్రజా ఫిర్యాదుల విభాగం, పెన్షన్ల మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో సమాచార హక్కు చట్టం, గ్రామ సభల నిర్వహణపై కార్యదర్శులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇన్‌చార్జి డీపీఓ మాట్లాడుతూ.. తెలంగాణ పంచాయతీరాజ్–2018 చట్టం ప్రకారం గ్రామస్థాయిలో జరిగే ప్రతి కార్యక్రమం, ప్రజలకు అందాల్సిన సేవలు, అభివృద్ధి పనులపై గ్రామసభల్లో చర్చ జరిగేలా చూడాలని సూచించారు. ప్రభుత్వ పథకాలు అర్హులందరికీ అందేలా చర్యలు చేపట్టాలన్నారు. సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకొని ఉత్తమ పంచాయతీలుగా తీర్చిదిద్దాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో రిటైర్డ్ డీపీఓ కృష్ణ, ఎంపీడీఓ సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.