
వేతన వెతలు!
గోపాలమిత్రలకు 10 నెలలుగా అందని జీతాలు
వివరాలు 10లో u
కోస్గి: పశుసంవర్ధకశాఖ సిబ్బందికి ఏమాత్రం తక్కువ కాకుండా రైతుల చెంతకు వెళ్లి క్షేత్రస్థాయిలో పాడి పశువులకు వైద్యసేవలు అందిస్తున్నారు గోపాలమిత్రలు. వీరికి నెలల తరబడి వేతనాలు రాకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో పశువైద్య సేవలు అందిస్తూ వేతన గోస పడుతున్నారు. ప్రభుత్వం వెంటనే బకాయి వేతనాలు విడుదల చేయడంతో పాటు క్రమం తప్పకుండా నెలనెలా వేతనాలు చెల్లించాలని కోరుతున్నారు.
దశాబ్ధాలుగా పశువైద్య సేవల్లో..
2001లో ‘గోపాలమిత్ర’ పథకానికి అప్పటి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. పశువైద్యశాలలకు దూరంగా ఉన్న గ్రామాల్లో పశువులకు ప్రథమ చికిత్స అందించేందుకు ఆసక్తి గల యువతను గోపాలమిత్రలుగా నియమించింది. సీజన్‌లో పశుసంవర్ధకశాఖ ఆధ్వర్యంలో నిర్వహించే వ్యాధినిరోధక టీకాల పంపిణీ, ఇతర పశువైద్య శిబిరాల సమయంలో గోపాలమిత్రలు వైద్యులకు సహాయకులుగా పనిచేస్తూ వస్తున్నారు. 2009లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి గోపాలమిత్రల సేవలను గుర్తించి.. గౌరవ వేతనంగా రూ. 2వేలు అందించేందుకు చర్యలు తీసుకున్నారు. అనంతరం వేతనాలు పెంచాలంటూ గోపాలమిత్రలు ధర్నాలు, నిరసనలు చేపట్టడంతో 2012లో అప్పటి ముఖ్యమంత్రి రోశయ్య రూ. 3,500కు వేతనం పెంచారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక 2019 నవంబర్‌లో అప్పటి సీఎం కేసీఆర్ రూ. 8,500లకు పెంచగా.. 2021 నుంచి పీఎఫ్‌తో కూడిన వేతనం రూ. 11,500 గోపాలమిత్రలకు అందిస్తున్నారు.
నిర్దేశిత లక్ష్యం సాధిస్తేనే పూర్తి వేతనం..
జిల్లావ్యాప్తంగా 46 మంది గోపాలమిత్రలు పనిచేస్తున్నారు. పాడి పశువులకు కృత్రిమ గర్భదారణ విషయంలో పశుసంవర్ధకశాఖ వీరికి టార్గెట్ ఇస్తోంది. ఒక్కో గోపాలమిత్ర 1,000 కృత్రిమ గర్భదారణ సెమన్‌లను పశువులకు వేయాల్సి ఉంటుంది. ఈ మేరకు పశువులు ఎదకు వచ్చే సమయాన్ని గుర్తించి.. రైతు సమ్మతితో టార్గెట్ పూర్తి చేస్తున్నారు. ఈ క్రమంలో ఇచ్చిన టార్గెట్ పూర్తి చేయకపోతే అరకొర వేతనం మాత్రమే అందుకోవాల్సి వస్తోంది.
క్షేత్రస్థాయిలో సేవలు..
ప్రభుత్వం పశువైద్యశాలలను ఏర్పాటు చేసినప్పటికీ.. అవసరమైన మేరకు వైద్యులు, ఇతర సిబ్బందిని నియమించకపోవడంతో గ్రామాల్లో పశువైద్య సేవల్లో గోపాలమిత్రలే కీలకంగా పనిచేస్తున్నారు. పశువులు అనారోగ్యానికి గురైనప్పుడు గోపాలమిత్రలు క్షేత్రస్థాయికి వెళ్లి ప్రథమ చికిత్స అందిస్తారు. పశువైద్యులకు సమాచారం ఇచ్చి.. వారి సూచనల మేరకు అవసరమైన వైద్యాన్ని అందిస్తారు. పశు సంవర్ధకశాఖ ఆధ్వర్యంలో సీజన్‌ల్ నిర్వహించే పశువైద్య శిబిరాల్లో ముఖ్య పాత్ర పోషిస్తూ వస్తున్నారు. ప్రభుత్వ పశువైద్య సిబ్బందితో కలిసి పశువులు, మేకలు, గొర్రెలు తదితర మూగజీవాలకు వ్యాధినిరోధక టీకాలను వేస్తున్నారు. గోపాలమిత్రలు ఉన్న గ్రామాలతో పాటు పరిసర గ్రామాల్లోని పశువులకు కృత్రిమ గర్భదారణ ఇంజక్షన్లు అందిస్తున్నారు. ప్రభుత్వం అందించే లక్ష్యం మేరకు సంకరజాతి, మేలుజాతి, జెర్సీ, ముర్రజాతి పశుసంపద పెంచేందుకు కృషి చేస్తున్నారు.
నెలల తరబడి
ఎదురుచూపులు..
ప్రభుత్వం ఇస్తున్న గౌరవ వేతనం సైతం సక్రమంగా అందకపోవడంతో గోపాలమిత్రలు ఆర్థిక ఇబ్బందులతోనే సేవలు కొనసాగిస్తున్నారు. గతేడాది అక్టోబర్ నుంచి ఇప్పటి వరకు 10 నెలల వేతనాలు పెండింగ్‌లో ఉండటంతో అవస్థలు పడుతున్నామని వాపోతున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు క్షేత్రస్థాయిలో పాడి పశుసంపద పెంపునకు కృషి చేస్తున్నామని.. ఇప్పటికై నా నెలనెలా వేతనాలు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
గతేడాది అక్టోబర్ నుంచి పెండింగ్
పాడి పరిశ్రమ అభివృద్ధికి గోపాలమిత్రల కృషి
రైతులతో మమేకమై పశువులకు కృత్రిమ గర్భదారణ చికిత్సలు
నెలనెలా వేతనాలు చెల్లించాలని వేడుకోలు