
ఎఫ్‌ఐఆర్ నమోదులో జాప్యం చేయొద్దు
నారాయణపేట క్రైం: పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు అందిన వెంటనే ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని డీఎస్పీ నల్లపు లింగయ్య అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని డీఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఆయన పాల్గొని.. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలతో నేరుగా సమస్యలను తెలుసుకొని ఫిర్యాదులు స్వీకరించారు. అనంతరం సంబంధిత పోలీసు అధికారులతో డీఎస్పీ ఫోన్ ద్వారా మాట్లాడి ప్రజావాణి ఫిర్యాదులు వెంటనే పరిష్కరించాలని సూచించారు. భూ తగాదాలకు సంబంధించిన ఫిర్యాదుల పరిష్కారానికి సంబంధిత రెవెన్యూ అధికారుల సమన్వయంతో కృషి చేయాలన్నారు. పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తే తప్పనిసరిగా రశీదు, ఎఫ్‌ఐఆర్ కాపీ ఇవ్వాలన్నారు. జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం పోలీసుశాఖ నిరంతరం పనిచేస్తుందన్నారు. పోలీసులు ప్రజల మన్ననలు పొందే విధంగా విధులు నిర్వర్తిస్తూ భరోసా, భద్రత కల్పించాలని తెలిపారు.