
నాణ్యతకు దిక్సూచి బీఐఎస్
నారాయణపేట: వస్తువుల కొనుగోలు విషయంలో భారత ప్రామాణిక సంస్థ నాణ్యతకు దిక్సూచి అని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో బీఐఎస్ జాయింట్ డైరెక్టర్ తన్నీరు రాకేశ్ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. ఇంజినీరింగ్ శాఖలైన ఆర్‌అండ్‌బీ, ఆర్‌డబ్ల్యూఎస్, ఇరిగేషన్ తదితర శాఖలు ఒకే రకమైన నాణ్యత ఉన్న వస్తువులను దేశవ్యాప్తంగా వినియోగిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలోనూ అవే ప్రమాణాలు పాటించాలని సూచించారు. డ్రిప్ ఇరిగేషన్ పైపులు, ఎరువులు, క్రిమిసంహారక మందుల విషయంలో నాణ్యతా ప్రమాణాలు పాటించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆయన ఆదేశించారు. సీ్త్ర, శిశు సంక్షేమశాఖ, ఇతర సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థులకు అందించే ఆహారం, పాల ఉత్పత్తులు నాణ్యతగా ఉండాలన్నారు. బీఐఎస్ జాయింట్ డైరెక్టర్ తన్నీరు రాకేశ్ మాట్లాడుతూ.. ఎలక్ట్రానిక్ వస్తువులు కంప్యూటర్స్, ప్రింటర్స్, ఏసీ, కూలర్స్, ఫ్యాన్ల విషయంలో విధిగా ఐఎస్‌ఐ ప్రమాణాలు ఉన్న వాటిని కొనుగోలు చేయడం ద్వారా విద్యుత్ ఆదా చేయవచ్చన్నారు. బంగారం కొనేటప్పుడు హల్‌మార్క్ ఉందా? లేదా చూడాలని తెలిపారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ శైలేష్ కుమార్, డీఆర్డీఓ మొగులప్ప, డీఏఓ జాన్ సుధాకర్, డీఈఓ గోవిందరాజులు, హౌసింగ్ పీడీ శంకర్ నాయక్, డీపీఓ సుధాకర్‌రెడ్డి, డీఐఈఓ సుదర్శన్, డీపీఆర్‌ఓ ఎంఏ రషీద్, వైద్యాధికారి శైలజ తదితరులు పాల్గొన్నారు.