అడ్డాకుల: మహబూబ్‌నగర్ జిల్లా అడ్డాకుల మండలంలోని గుడిబండ సమీపంలో డ్రై పోర్ట్(రోడ్డు మార్గం ద్వారా ఓడరేవుకు అనుసంధానించబడిన ఇన్‌ల్యాండ్ టెర్మినల్) నిర్మాణానికి అధికారులతో కలిసి ఎమ్మెల్యే జి.మధుసూదన్‌రెడ్డి మంగళవారం స్థలాన్ని పరిశీలించారు. గుడిబండ శివారులోని సర్వే నంబర్ 118లో ఉన్న ప్రభుత్వ స్థలాన్ని తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక, మౌలిక సదుపాయాల సంస్థ, లాజిస్టిక్స్ డైరెక్టర్ అపర్ణ, ఇతర అధికారులు స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. డ్రై పోర్ట్ ఏర్పాటు చేయడానికి ఉన్న సాధ్యాసాధ్యాలను అంచనా వేశారు. ఇటీవల దేవరకద్ర వద్ద ప్రతిష్టాత్మకమైన బ్రహ్మోస్ మిస్సైల్ తయారీ యూనిట్ ఏర్పాటుకు ప్రభుత్వం సానుకూలత వ్యక్తం చేయగా.. తాజాగా గుడిబండ వద్ద డ్రై పోర్ట్ నిర్మా ణం కోసం స్థల పరిశీలన చేయడం శుభ పరిణామమని ఎమ్మెల్యే జి.మధుసూదన్‌రెడ్డి పేర్కొన్నా రు. దేవరకద్ర నియోజకవర్గంలో 68 కిలోమీటర్ల మేర జాతీయ రహదారి విస్తరించి ఉన్నందున పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి శ్రీధర్‌బాబును కోరడంతో పాటు డ్రై పోర్ట్ ఏర్పాటు చేయాలని అసెంబ్లీలో ప్రస్తావించినట్లు చెప్పారు. దీనికి వారు సానుకూలంగా స్పందించి డ్రై పోర్ట్ ఏర్పాటు కోసం స్థలాన్ని పరిశీలించడానికి అధికారులను గుడిబండకు పంపినట్లు తెలిపారు. హైదరాబాద్, కర్నూలు, రాయచూర్ ప్రాంతాలకు సులభమైన కనెక్టివిటీ ఉండటం కూడా డ్రై పోర్ట్ నిర్మాణానికి కలిసి వస్తుందని చెప్పారు. నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ఉపాధి కల్పినకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డి సహకారంతో పరిశ్రమలను ఏర్పాటు చేయించి యువతకు ఉపాధి కల్పించేందుకు శాయశక్తులా కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ శేఖర్, నాయకులు శ్రీహరి, విజయమోహన్‌రెడ్డి, జగదీశ్వర్, దశరథ్‌రెడ్డి, తిరుపతయ్య, శేఖర్‌రెడ్డి, బోయిని చంద్రశేఖర్, శకుంతల, సత్యనారాయరెడ్డి, రాజశేఖర్‌రెడ్డి, సయ్యద్‌షఫి, వేగనాథ్ ఉన్నారు.
అధికారులతో కలిసి స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే జీఎంఆర్