
కేజీబీవీలో రాష్ట్రవిద్యాశాఖ కార్యదర్శి బస
మరికల్: మండలంలోని పస్పుల కస్తుర్బా గాంధీ విద్యాలయంలో రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి, ఐఏఎస్ యోగతా రాణా బుధవారం రాత్రి సందర్శించారు. కలెక్టర్ సిక్తా పట్నాయక్‌తో కలిసి పాఠశాలకు చేరుకున్నారు. ముందుగా పాఠశాల పరిసరాలు, తరగతి గదులు, మరుగుదొడ్లను పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. విద్యార్థులు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్యాలు చేయగా తిలకించారు. ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకుంటూ విద్యార్థులు బాగా చదివి ఉన్నత స్థాయికి చేరుకోవాలని సూచించారు. అంతకుముందు వివిధ పాఠ్యంశాలకు సంబంధించిన ప్రశ్నలు వేసి విద్యార్థులతో జవాబులు రాబట్టారు. ఎస్‌ఓ రాజ్యలక్ష్మితో పలు విషయాలపై ఆరా తీశారు.
దరఖాస్తుల ఆహ్వానం
నారాయణపేట: జిల్లాలో నేషనల్ హెల్త్ మిషన్ ప్రోగ్రాంలో గల మెడికల్ ఆఫీసర్ (కాంట్రాక్ట్ విధానంలో) పనిచేయుటకు అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి జయచంద్రమోహన్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ అయి ఉన్నవారు ఒరిజినల్ ధ్రువీకరణ పత్రాలతో ఈ నెల 21న ఉదయం 11 గంటలకు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయంలో నిర్వహించే ఇంటర్వ్యూకు హాజరుకావాలని తెలిపారు. మరిన్ని వివరాలకు www.nara yanapet.telangana.gov.in కు సంప్రదించాలని తెలిపారు.
పెరపళ్ల భూ నిర్వాసితులను ఆదుకోవాలి
నారాయణపేట: పేట– కొడంగల్ ఎత్తిపోతల ప్రాజెక్టు కింద భూములు కోల్పోతున్న పెరపళ్ల రైతులను ఆదుకోవాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి గోపాల్, రైతు సంఘం జిల్లా కార్యదర్శి అంజిలయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం పెరపళ్ల గ్రామంలో భూములు కోల్పోతున్న రైతులతో వారు మాట్లాడారు. ప్రభుత్వం రూ.14 లక్షలు ఎకరాకు ఇస్తామనడం సమంజసం కాదని, ఈ ప్రాంతంలో ఎకరా రూ.30 లక్షల నుంచి రూ.కోటి వరకు ధర బహిరంగ మార్కెట్‌లో పలుకుతుందన్నారు. గ్రామంలో దాదాపుగా 370 ఎకరాల వరకు ప్రాజెక్ట్ కింద భూములు సేకరించాల్సి ఉందని ప్రభుత్వం ప్రకటించిందన్నారు. ఇందులో కొంతమంది రైతులకు సంబంధించి ఉన్న మొత్తం భూమి కోల్పోతున్నారని అలాంటి వారికి భూమికి బదులు భూమి చూయించాలని, ఇంట్లో ఒకరికి ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం బలవంతంగా భూములు తీసుకోవడం ఆపాలన్నారు. రైతులకు న్యాయమైన పరిహారం ఇవ్వాలని, తరువాత భూములు సేకరించాలని ప్రభుత్వాన్ని కోరారు. కార్యక్రమంలో రైతులు ఎం అంజప్ప,ఆంజనేయులు, రామాంజనేయులు, భీమప్ప, బోయిని రాములు, గొల్ల కిష్టప్ప, కొనంగేరి బాలప్ప తదితరులు పాల్గొన్నారు.
మీసేవ కేంద్రం
ఆకస్మిక తనిఖీ
నారాయణపేట: జిల్లా కేంద్రంలోని శ్రీలత మీ సేవను ఈడీఎం కె .విజయ్ కుమార్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. మీ సేవ కేంద్రానికి ధ్రువపత్రాల కోసం, రేషన్ కార్డులకు వచ్చిన దరఖాస్తులను ఆయన పరిశీలించారు. అంతేకాక ప్రభుత్వం నిర్దేశించిన ధరల ప్రకారమే ఫీజులు తీసుకోవాలని మీ–సేవ ఆపరేటర్ ను ఆదేశించారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోని 22 శాఖలకు సంబంధించి 482 రకాల సేవలను మీ సేవ కేంద్రాల ద్వారా అందిస్తున్నారని, రెవెన్యూ శాఖ కు సంబంధించిన దరఖాస్తులు వీటి ద్వారానే సంబంధిత కార్యాలయాలకు చేరుతున్నాయన్నారు. వీటితో పాటు తాజాగా వివాహ ధ్రువీకరణ పత్రం, మార్కెట్ విలువ సర్టిఫికెట్ మీ సేవ ద్వారానే ప్రజలకి అందుబాటులో వచ్చాయని వాటిని సైతం ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.

కేజీబీవీలో రాష్ట్రవిద్యాశాఖ కార్యదర్శి బస