
పాఠశాల పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి
ధన్వాడ: మండల కేంద్రంలోని తెలంగాణ మోడల్ పాఠశాల, కళాశాలను బుధవారం కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈక్రమంలో పాఠశాల ఆవరణలో పిచ్చి మొక్కలు పెరిగి విద్యార్థులకు ఇబ్బందిగా మారడంతో సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పంచాయతీ సిబ్బందితో వెంటనే శుభ్రం చేయించాలని ఎంపీడీఓ వెంకటేశ్వర్‌రెడ్డిని ఆదేశించారు. పాఠశాల పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. అలాగే విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనంపై ఆరా తీశారు. అనంతరం వంట చేసేందుకు గది లేకపోవడం ఇబ్బందిగా మారిందని తెలియడంతో వంట రూం ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
మెనూ తప్పనిసరి
కోస్గి రూరల్: పాఠశాలలు, వసతి గృహాల్లో మెనూ తప్పక పాటించాలని, నాణ్యమైన భోజనం విద్యార్థులకు అందించాలని, విద్యార్థులకు మౌలిక సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని కలెక్టర్ సిక్తా సట్నాయక్ అన్నారు. బుధవారం గుండుమాల్‌లోని ఆదర్శ పాఠశాలను ఆమె సందర్శించారు. విద్యార్థులతో స్వయంగా మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. మధ్యాహ్న భోజన నాణ్యతపై ఆరా తీశారు. చదువుపై శ్రద్ధ వహించాలని విద్యార్థులకు సూచించారు. పాఠశాల వరకు సీసీ రోడ్డు సౌకర్యాన్ని కల్పించాలని, సమీపంలోని చెత్తా చెదారాలను తొలగించాలని ఆదేశించారు. పరిసరాలు పరిశుభ్రంగా లేకపోతే వ్యాధులు ప్రభలే అవకాశం ఉందని గ్రామ పంచాయతీ అధికారులు శ్రద్ద వహించాలని అన్నారు. పాఠశాల ప్రిన్సిపల్ నిలిమవర్దిని, పీఈటీ బాల్‌రాజ్ తదిదరులు ఉన్నారు.