
విద్యుత్ శాఖలో ఖాళీలను భర్తీ చేయాలి
మరికల్: రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ శాఖలో ఉన్న ఖాళీలను ప్రభుత్వం భర్తీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ 1104 యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాయిబాబు అన్నారు. మరికల్‌లో బుధవారం ఆయనకు ఘన స్వాగతం పలికి ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన ఎలక్ట్రిసిటి యూనియన్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన మండలాల్లో ఏఈ పోస్టులు, కింది స్థాయి సిబ్బంది ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయకపోవడంతో ఉన్న సిబ్బందిపై పనిభారం పెరుగుతుందన్నారు. ఆర్టిజన్ కార్మికులకు కన్వర్షన్‌తో పాటు ఏపీఎస్‌ఈబీ రూల్స్ వర్తింప చేయాలని, వ్యవసాయ రంగానికి నిరంతరంగా విద్యుత్ సరఫరా చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్న కార్మికులను గుర్తించి రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా ఆర్టిజన్ కార్మికులను చూడాలన్నారు. ఆర్టిజన్ కార్మికుల పదోన్నతులు ఇచ్చి ఏపిఎస్‌ఈబీ రూల్స్ వర్తింపజేయాలని సూచించారు. 2009లో రద్దు చేసిన పింఛన్‌ను పునఃప్రారంభించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 2017 నుంచి ఆర్టిజన్ ఉద్యోగులకు ఈపీఎస్, జీపీఎస్, అనారోగ్యంతో బాధపడుతున్న వారికి రిటైర్మెంట్ బెనిఫిట్ అందజేసి పదవీ విరమణ పొందే విధంగా అవకాశం కల్పించాలన్నారు. కార్యక్రమంలో యూనియన్ జిల్లా అధ్యక్షుడు గోవిందరాజు, డివిజన్ కార్యదర్శి మొగులప్ప, మధుసూదన్‌గౌడ్, రఘు, రవీంద్ర చారీ,శ్రీనివాస్‌రెడ్డి, ఆనంద్‌కుమార్, శ్రీధర్‌లు పాల్గొన్నారు.