బాలికా విద్యకు భరోసా | - | Sakshi
Sakshi News home page

బాలికా విద్యకు భరోసా

May 24 2025 12:09 AM | Updated on May 24 2025 12:09 AM

బాలిక

బాలికా విద్యకు భరోసా

మరో మూడు కేజీబీవీలు ఇంటర్‌కు అప్‌గ్రేడ్‌

మరికల్‌: విద్యార్థినుల విద్యాభ్యున్నతి కోసం కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు తెలుగు/ఆంగ్ల మాద్యమంలో విద్యాబోధన అందించేవారు. ఇంటర్‌ విద్య అందుబాటులో లేకపోవడంతో పలువురు చదువు మధ్యలోనే ఆపేసిన సందర్భాలున్నాయి. దీన్ని అధిగమించేందుకు వాటిలో పలు కేజీబీవీలను జూనియర్‌ కళాశాలలుగా అప్‌గ్రేడ్‌ చేశారు. తద్వారా ఇప్పటికే జిల్లాలో 8 అందుబాటులో ఉండగా ఈ ఏడాది మరో మూడు కేజీబీవీలు అప్‌గ్రేడ్‌ చేస్తు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో వాటి సంఖ్య 11కు చేరుకుంది. ఆర్థిక సమస్యలతో చదువుకు దూరమైన వారితోపాటు అనాథలైన విద్యార్థినులకు ఎంతో మేలు చేకూరనుంది.

ప్రత్యేక కోర్సులు

జిల్లాలోని 11 కేజీబీవీల్లో 8 కేజీబీవీలో ఇప్పటి వరకు ఇంటర్‌ కోర్సులు ఉండేవి. 2025–26 విద్యా సంవత్సరానికి మరికల్‌, మాగనూర్‌, కోస్గి కస్తూర్బాల్లో ఇంటర్‌ తరగతులు నిర్వహించనున్నారు. ఈ మూడు కేజీబీవీలను ఇంటర్‌కు ఆప్‌గ్రేడ్‌ కావడంతో మరికల్‌ కేజీబీవీలో బైపీసీ, అగ్రికల్చర్‌ క్రాప్‌ ప్రోడక్ట్‌, కోస్గి కస్తుర్బాలో సీఈసీ, ఎంపీహెచ్‌డబ్ల్యూ(ఎప్‌), మాగనూర్‌ కేజీబీవీలో బైపీసీ, ఎంఎల్‌టీ కోర్సులను ప్రవేశపెట్టారు. ఈ విద్య సంవత్సరం నుంచే పాత కేజీబీవీలతో పాటు కొత్తగా ఏర్పడిన మరికల్‌, మాగనూర్‌, కోస్గి మండలాల్లో ఇంటర్‌ కళాశాలల ప్రారంభానికి అధికారులు చర్యలు చేపట్టారు. ప్రతి గ్రూప్‌లో 40 మంది విద్యార్థులకు అవకాశం కల్పించనున్నారు. జూన్‌లో ఇంటర్‌ ప్రవేశాలు కల్పించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. అధిక శాతం అనాథ, పేద బాలికలు వీటిలో చదువుకునే అవకాశం కల్పిస్తారు.

నిరుపేదలు.. తల్లి, తండ్రిని కోల్పోయిన వారు.. అనాథలైన విద్యార్థినులకు కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాలు (కేజీబీవీ)లు అండగా నిలుస్తున్నాయి. చదువుతో పాటు వసతి కల్పించడంతో చాలా మంది ఇందులో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఒకప్పుడు పదో తరగతి పూర్తయ్యాక.. ఇంటర్‌ చదువులకు కుటుంబసభ్యులు ఒప్పుకోక, వేరే ప్రాంతాలకు పంపించలేక చాలా మంది చదువులు మధ్యలోనే ఆపివేసేవారు. మరికొందరికి చిన్నతనంలోనే వివాహాలు చేసేవారు. ఈక్రమంలో ప్రభుత్వం కేజీబీవీలను ఇంటర్‌కు అప్‌గ్రేడ్‌ చేయడంతో ఎంతో మంది విద్యార్థినులకు ఉన్నత చదువులకు భరోసాగా నిలవనుంది. ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకొని ఈ ఏడాది ఇంటర్‌ విద్యార్థినులు సైతం ఉత్తమ ప్రతిభ కనబర్చి సత్తా చాటారు.

జిల్లాలో మొత్తం 11 కు చేరిన ఇంటర్‌ విద్యాలయాలు

ఈ ఏడాది ఇంటర్‌లో 84 శాతంఉత్తీర్ణతతో విద్యార్థినుల రాణింపు

చదువుతోపాటు వసతి కల్పించడంతోచేరికకు ఆసక్తి

ఎంతో ప్రయోజనం

ఈ ఏడాది మరో మూడు కేజీబీవీలను జూనియర్‌ కళాశాలలుగా అప్‌గ్రేడ్‌ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇది విద్యార్థినులకు ఎంతో ప్రయోజనం. కొత్తగా కంప్యూటర్‌ సైన్స్‌ కోర్సులను తీసుకురావడం హర్షణీయం. ఇంటర్‌ ప్రవేశాలకు వచ్చిన దరఖాస్తులను క్షుణంగా పరిశీలించి పారదర్శకంగా అర్హులను ఎంపిక చేస్తాం.

– నర్మద, జీసీడీఓ, నారాయణపేట

బాలికా విద్యకు భరోసా 1
1/1

బాలికా విద్యకు భరోసా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement