
బ్యాంకర్లు నిర్దేశిత లక్ష్యాలు చేరుకోవాలి
నారాయణపేట: బ్యాంకర్లు నిర్దేశిత లక్ష్యాలను చేరుకోవాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని వీసీ హాల్లో డీసీసీ సమావేశానికి చైర్మన్‌గా కలెక్టర్, కన్వీనర్‌గా లీడ్ బ్యాంక్ మేనేజర్ వ్యవహరించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రాధాన్యత రంగాలైన అగ్రికల్చర్, ఎంఎస్‌ఎంఈ రంగాలకు అధిక మొత్తంలో రుణాలు మంజూరు చేసి జిల్లా అభివృద్ధికి తోడ్పడాలని సూచించారు. ఈ సమావేశంలో ఆర్‌బీఐ నుంచి ఏజీఎం శ్రావ్య, నాబార్డ్ నుంచి డీడీఎం షణ్ముఖచారి, ఎస్‌బీఐ ఏజీఎం రాంమూర్తి, టిజిబి రిజినల్ మేనేజర్ సత్యనారాయణ, యుబిఐ నుంచి శ్రీనివాసమూర్తి , వివిధ బ్యాంకుల ప్రతినిధులు, జిల్లా అధికారులు పాల్గొని వివిధ సమస్యలపై చర్చించి తగునిర్ణయాలు తీసుకున్నారని ఎల్‌డిఎం విజయ్‌కుమార్ తెలిపారు. అంతకుముందు వార్షిక ప్రణాళిక సంబంధించిన 2024–25 మార్చి 25తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి రూ.2514.18 కోట్లతో వృద్ధి, వార్షిక ప్రణాళికలో ఇది 76.93 శాతమని, మే సెగ్మెంట్ సంబంధించి రూ.153.92 కోట్లతో 61.04 శాతం ప్రగతి, ప్రాధాన్యత రంగానికి రూ.2,070 కోట్లు రుణాలు మంజూరు చేయడం జరిగిందని ఎల్‌డీఎం పేర్కొన్నారు. వార్షిక రుణప్రణాళిక 2025–26 గాను రూ.4204.49 కోట్ల రుణ లక్ష్యంతో ఏసీపీ 2025–26 పుస్తకాన్ని కలెక్టర్ ఆవిష్కరించారు. ఇందులో రైతులకు పంట రుణాలు రూ.2,195.07, వ్యవసాయ ఇతర మౌలిక సదుపాయలకు రూ.1,275.87 కోట్లు మొత్తంగా వ్యవసాయరంగానికి రూ.3,470.93 కోట్లు, స్వయం సహాయక సంఘాలకు, సూక్ష్మ తరహా పరిశ్రమలకు రూ.148 కోట్లు, చిన్న తరహా పరిశ్రమలకు రూ.162.30 కోట్లు మంజూరు చేయాలని నిర్ధేశించారు.
నిబంధనల మేరకు అనుమతులు ఇవ్వాలి
జిల్లాలో ఔత్సహిక పారిశ్రామిక వేత్తలను ప్రొత్సహిస్తూ టీజీ పాస్ ద్వారా పరిశ్రమల స్థాపనకు వివిధ శాఖల నుంచి అనుమతులను నిబంధనల మేరకు నిర్ధేశిత గడువులోగా ఇవ్వాలని కలెక్టర్ సిక్తాపట్నాయక్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ వీసీ హాల్లో పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జిల్లా పరిశ్రమల ప్రోత్సాహక కమిటీ సమావేశం నిర్వహించారు.
అధికారులు అప్రమత్తంగా ఉండాలి
జిల్లా అభివృద్ధి కార్యక్రమాలపై అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ తెలిపారు. జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ దిశ సమావేశం ఈ నెల 28న ఉన్నందున కలెక్టరేట్‌లో సమీక్ష నిర్వహించారు. సంబంధిత శాఖ వారు నోట్స్ స్కీమ్స్ పై రేపటి వరకు ఇవ్వాలన్నారు. ఈ సమావేశంలో డీఆర్‌డీఓ మొగులప్ప, డీఏఓ జాన్‌సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
రాజీవ్ యువ వికాసంతో ఉపాధి
రాజీవ్ యువ వికాసం ద్వారా అనేక మంది ఉపాధి పొందుతారని కలెక్టర్ అన్నారు. శుక్రవారం రాజీవ్ యువ వికాసం పథకం పర్చేజ్ కమిటీ ఫర్ ఆల్ కార్పొరేషన్స్‌పై నిర్వహించిన సమీక్ష సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. రాజీవ్ వికాసం దరఖాస్తుదారులకి ఫైనాన్షియల్ అసిస్టెంట్, గ్రౌండింగ్ తదితర వాటిపై సమీక్షించారు. అడిషనల్ కలెక్టర్ సంచిత్ గంగ్వార్, డిఎస్‌సి కార్పోరేషన్ అబ్దుల్ ఖలీల్, ఎల్‌డీఎం విజయ్ పాల్గొన్నారు.