
నేతన్నలను ఆదుకుంటాం
అమరచింత: పట్టణంలోని చేనేత ఉత్పత్తుల సంఘంలో వస్త్రాలు తయారు చేస్తూ ఉపాధి పొందుతున్న నేత కార్మికులతో పాటు కుట్టు శిక్షణలో నైపుణ్యం పొందిన మహిళలకు నాబార్డు తరఫున ఆదుకునేందుకు సిద్ధంగా ఉన్నామని సీజీఎం ఉదయభాస్కర్ తెలిపారు. పట్టణంలోని చేనేత ఉత్పత్తుల కంపెనీని నాబార్డు సీజీఎంగా బాధ్యతలు స్వీకరించిన ఆయన శుక్రవారం సందర్శించి రోలింగ్ గదిని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నేతన్నలు తయారు చేసిన చీరలు రోలింగ్ కోసం గద్వాలకు తీసుకెళ్లకుండా ఇక్కడే చేసుకునే అవకాశం కల్పించడం సంతోషకరమన్నారు. మహిళలు కుట్టు శిక్షణ పొందడమే గాకుండా పలు రకాల డిజైన్ల వస్త్రాలను కుట్టడంలో మెళకువలు నేర్చుకున్నారని చేనేత ఉత్పత్తుల సంఘం కంపెనీ సీఈఓ మహంకాళి శేఖర్ వివరించారు. రాబోయే రోజుల్లో ఇక్కడ తయారు చేస్తున్న వస్త్రాలు జాతీయ, అంతర్జాతీయస్థాయితో పాటు ఆన్‌లైన్ మార్కెటింగ్‌కు కావాల్సిన మద్దతునిస్తామని హామీనిచ్చారు. అనంతరం మగ్గాలపై జరీ చీరలు తయారు చేస్తున్న కార్మికులతో మాట్లాడి వారి ఆదాయం అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం తాము సైతం కంపెనీ యజమానులమని.. ఇక్కడ పనిచేసే ప్రతి ఒక్కరికి లాభాలు సమానంగా చేరుతాయని కార్మికులు వివరించారు. కార్యక్రమంలో నాబార్డు డీజీఎం దీప్తి సునీల్, డీడీఎం మనోహర్‌రెడ్డి, ఆర్‌డీఎస్ సంస్థ సీఈఓ చిన్నమ్మ థామస్, కంపెనీ డైరెక్టర్లు పబ్బతి వెంకటస్వామి, అశోక్, జగదీశ్ తదితరులు పాల్గొన్నారు.