
ప్రాధాన్యతా క్రమంలో.. ప్రాజెక్టులు పూర్తిచేస్తాం
అచ్చంపేట/ బల్మూర్: ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని జూరాల, కోయిల్‌సాగర్, భీమా, నెట్టెంపాడు, కేఎల్‌ఐతోపాటు పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రణాళిక, జీఓ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో వచ్చినవేనని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న పాలమూరు– రంగారెడ్డి, అచ్చంపేట ఎత్తిపోతలు, ఉమామహేశ్వరం రిజర్వాయర్ నిర్మాణాలపై ప్రత్యేక దృష్టిసారించి.. ప్రాధాన్యతా క్రమంలో పూర్తి చేస్తామని తెలిపారు. సోమవారం అచ్చంపేట నియోజకవర్గంలోని బ ల్మూర్ మండలం గట్టుతుమ్మెన్‌లో రూ.43 కోట్లతో చేపట్టనున్న పలు విద్యుత్ సబ్‌స్టేషన్లకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ ప్రభుత్వం పదేళ్ల పాలనలో అభివృద్ధి పనులు మొదలు పెట్టిందే తప్ప పూర్తి చేయలేదని విమర్శించారు. అచ్చంపేట నియోజవర్గానికి, తమ కు విడదీయని బంధం ఉందని, అన్న మల్లు అనంతరాములుతోపాటు మల్లు రవి ఇక్కడి నుంచే ఎన్నికల్లో పోటీ చేశారని, తాను అప్పట్లో విద్యాభ్యాసం చేస్తూ ఇక్కడికి వచ్చానని గుర్తుచేసుకున్నారు.
పదేళ్లలో ఒక్క ఉద్యోగం ఇవ్వలే..
నీళ్లు, నిధులు, నియామకాలంటూ కొట్లాడి ప్రత్యేక రాష్ట్రాన్ని తెచ్చుకున్న యువతకు గత పాలకులు అన్యాయం చేశారని డిప్యూటీ సీఎం విమర్శించారు. పదేళ్లు పాలించిన కేసీఆర్ ఒక్కసారి కూడా గ్రూప్–1 పరీక్ష నిర్వహించలేకపోయారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే లక్ష ప్రభుత్వ ఉద్యోగాల కలను సాకారం చేశామని, ఇప్పటికే 57 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని, మరో 30 వేల ఉద్యోగ నియామకాల ప్రక్రియ కొనసాగుతుందని చెప్పారు. రూ.12,600 కోట్లతో నల్లమల డిక్లరేషన్ చేసిందని, దేశ చరిత్రలో ఎవరూ ఇప్పటి వరకు ఈ ఆలోచన చేయలేదని వివరించారు. ఇందిర సౌర గిరి జల వికాసం పేరిట నాటి కాంగ్రెస్ ప్రభుత్వం పట్టాలిచ్చిన 6.70 లక్షల ఎకరాలకు సోలార్ కరెంట్, పంపుసెట్లు, డ్రిప్ స్ప్రింక్లర్లను వినియోగించి ఉద్యానశాఖ ద్వారా ఉచితంగా అవకాడో, వెదురు, నిమ్మ వంటి మొక్కలను ఉచితంగా గిరిజన రైతులకు అందిస్తున్నామని తెలిపారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 25 ఎకరాల విస్తీర్ణంలో రూ.200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మిస్తున్నామన్నారు. రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనేది ప్రజా ప్రభుత్వం లక్ష్యమని.. మొదటి సంవత్సరం రూ.21 వేల కోట్లు వడ్డీ లేని రుణాలు స్వయం సహాయక సంఘాల సభ్యులకు అందించామని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీ మల్లు రవి, టీజీఎస్‌పీడీసీఎల్ చైర్మన్ ముషారఫ్ అలీ ఫారూఖీ, ట్రాన్స్‌కో సీఎండీ కృష్ణభాస్కర్, కలెక్టర్ బదావత్ సంతోష్, ఎస్పీ వైభవ్ గైక్వాడ్ రఘునాథ్, వనపర్తి, దేవరకద్ర ఎమ్మెల్యేలు మేఘారెడ్డి, మధుసూదన్‌రెడ్డి, రాష్ట మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్, డీసీసీబీ అధ్యక్షుడు మామిళ్లపల్లి విష్ణువర్ధన్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్మన్ రాజేందర్, జిల్లా ఓబీసీ చైర్మన్ గిరివర్ధన్‌గౌడ్, తదితరులు పాల్గొన్నారు.
పాలమూరును అభివృద్ధి చేసే బాధ్యత మాది
కోటి మంది మహిళలను
కోటీశ్వరులను చేయడమే లక్ష్యం
బీఆర్‌ఎస్ పనులు చేపట్టింది తప్పా పూర్తిచేయలే..
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క