
ఉత్సాహంగా జిల్లాస్థాయి అథ్లెటిక్స్ ఎంపిక
మహబూబ్‌నగర్ క్రీడలు: సికింద్రాబాద్‌లోని జింఖానా మైదానంలో వచ్చేనెల 1న జరిగే రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొనే జిల్లా క్రీడాకారుల ఎంపికలను సోమవారం జిల్లాకేంద్రంలోని మెయిన్ స్టేడియంలో నిర్వహించారు. ఎంపికలను జిల్లా అథ్లెటిక్స్ సంఘం ప్రధాన కార్యదర్శి జి.శరత్‌చంద్ర ప్రారంభించి మాట్లాడారు. అథ్లెట్లు రాష్ట్రస్థాయి పోటీల్లో పతకాలు సాధించి జిల్లాకు పేరు ప్రతిష్టలు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఎంపికల్లో 60 మంది బాల, బాలికలు పాల్గొన్నారు. అండర్– 8 విభాగంలో బాల, బాలికలకు 60 మీ., 200 మీ., టెన్నిస్‌బాల్ త్రో, స్టాండింగ్ బ్రాడ్ జంప్, అండర్–10 విభాగంలో బాల, బాలికలకు 60 మీ., 300 మీటర్ల పరుగు, లాంగ్‌జంప్, కిడ్స్ జావెలిన్, అండర్–12లో బాల, బాలికలకు 60 మీ., 300 మీ., 600 మీటర్ల పరుగు, లాంగ్‌జంప్, షాట్‌పుట్, కిడ్స్ జావెలిన్ అంశాల్లో ఎంపికలు నిర్వహించామన్నారు. ఆయా క్రీడాంశాల్లో మెరుగైన ప్రతిభ కనబరిచిన వారిని రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేస్తామని, వారి వివరాలు తర్వాత ప్రకటిస్తామని పేర్కొన్నారు.