
గొప్ప సంఘ సంస్కర్త భాగ్యరెడ్డి వర్మ
నారాయణపేట: అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం పాటుపడిన గొప్ప సంఘ సంస్కర్త భాగ్యరెడ్డి వర్మ అని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. గురువారం కలెక్టరేట్‌లోని ప్రజావాణి హాల్‌లో భాగ్యరెడ్డివర్మ జయంతి ఉత్సవాల్లో పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దళిత సమాజోద్దరణ, అంటరానితనం, మహిళల బాలికల విద్య కోసం ఎంతో కృషి చేశారని, జోగినీ వ్యవస్థ తొలగించడానికి పాటుపడ్డారని అన్నారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ సంచిత్ గంగ్వార్, ఆర్డీఓ రాంచందర్, ఏఓ జయసుధ, అధికారులు ఉమాపతి, అబ్దుల్ ఖలీల్, రషీద్ తదితరులు పాల్గొన్నారు.
దళిత వైతాళికుడు..
దళితుల హక్కులు, సమానత్వం కోసం పోరాడిన గొప్ప వ్యక్తి భాగ్యరెడ్డివర్మ అని ఎస్పీ యోగేష్ గౌతమ్ అన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన భాగ్యరెడ్డి వర్మ చిత్ర పటానికి ఎస్పీ పూలమాలలు వేసి నివాళులర్పించారు. హైదరాబాద్ సంస్థానంలో అనేక దళిత బాలికల పాఠశాలలను స్థాపించి వేలాది మంది విద్యార్థులకు విద్య అందించి వారి అభ్యున్నతికి పునాది వేశాడని కొనియాడారు. ఏఎస్పీ రియాజ్‌హుల్ హక్, ఆర్‌ఎస్‌ఐలు శివశంకర్, మద్దయ్య పాల్గొన్నారు.