
ఆహార నియమాలు తప్పనిసరి
నారాయణపేట రూరల్: అసంక్రమిక వ్యాధులకు గురికాకుండా ఆరోగ్య నియమాలను పాటించాలన్నారు. పౌష్టికాహారం, సరైన నిద్ర తప్పనిసరిగా అవసరమని డీఎంహెచ్‌ఓ జయ చంద్రమోహన్ అన్నారు. మండలంలోని అప్పక్‌పల్లి సమీపంలో నిర్మించిన ప్రభుత్వ మెడికల్ కళాశాల కాన్ఫరెన్స్ హాల్లో వైద్యాధికారులు, ఇతర సిబ్బందికి గురువారం ఎన్సీడీ కార్యక్రమంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మనిషి జీవనశైలిలో మార్పుతో పాటు ఆహార నియమాలు పాటించకపోవడంతోనే అనారోగ్య సమస్యలు ఎదురవుతున్నాయని అన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ఆహార అలవాట్లు ఉండాలని, ప్రతిరోజు కొంత సమయం యోగా, మెడిటేషన్‌కు కేటాయించాలన్నారు. 30 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరు ఆరోగ్య నియమాలను పాటించాలని సూచించారు. కార్యక్రమానికి హాజరైన ఎన్సీడీ స్టేట్ కోఆర్డినేటర్ డాక్టర్ అబ్దుల్ వాసే కార్యక్రమ లక్ష్యాలు, హైపర్ టెన్షన్, డయాబెటిస్, బెస్ట్, సర్వైకల్, ఓరల్ క్యాన్సర్, అసంక్రమిక వ్యాధులు తదితర అంశాలపై అవగాహన కల్పించారు. ముఖ్యంగా వ్యాధుల నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలను రోగులకు వివరించాలని సూచించారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్‌ఓ శైలజ, సత్య ప్రకాశ్ రెడ్డి, అశోక్ కుమార్ పాల్గొన్నారు.