
వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలి
నారాయణపేట: వర్షాకాలంలో ఎలాంటి నష్టం జరగకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ సిక్తాపట్నాయక్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టర్ ఛాంబర్‌లో ఎస్పీ యోగేష్ గౌతమ్‌తో కలిసి వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు. వర్షాకాలంలో రోడ్లు, కల్వర్టులు వాటి పటిష్టతపై రిపోర్ట్ ఇవ్వాలన్నారు. ఎలాంటి నష్టం రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. విద్యుత్‌శాఖకు సంబంధించి విద్యుత్ స్తంభాలు, వైర్లు తదితర వాటిపై సమీక్షించుకోవాలన్నారు. డీపీఓ గ్రామ పంచాయతీ పరిధిలో ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. పాత ఇళ్లను గుర్తించి ప్రత్యామ్నాయం చూపాలన్నారు. వ్యవసాయ శాఖ సంబంధించి పంటలపై నివేదికలు తయారు చేయాలన్నారు. ఎరువులు, యూరియా అందుబాటులో ఉంచుకోవాలన్నారు. సీపీఓ ఇరిగేషన్ వారు రిపోర్టు పంపాలన్నారు. ఎస్పీ యోగేష్ గౌతమ్ మాట్లాడుతూ గతేడాది మద్దూర్, మరికల్‌లో వర్షాలు అధికంగా కురవడం వల్ల అక్కడ ఎలాంటి ప్రమాదాలు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నామని తెలిపారు. అందరూ అప్రమత్తంగా ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు.