
‘పత్రికా స్వేచ్ఛను కాలరాస్తే సహించం’
నారాయణపేట/నారాయణపేట రూరల్: పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగేలా ఏపీ పోలీసులు వ్యవహరించడం సరికాదని సీనియర్ జర్నలిస్టులు నిరసన వ్యక్తం చేశారు. ‘సాక్షి’ దినపత్రిక ఎడిటర్ ధనుంజయరెడ్డి ఇంటిపై ఏపీ పోలీసుల దౌర్జన్యాన్ని ఖండిస్తు గురువారం జిల్లా వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో జర్నలిస్టులు నిరసన వ్యక్తం చేశారు. జిల్లా కేంద్రంలోని వివిధ జర్నలిస్టు సంఘాల ఆధ్వర్యంలో స్థానిక మున్సిపల్ పార్క్ దగ్గర నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. అనంతరం మోటార్ బైక్ ర్యాలీ నిర్వహిస్తూ ఏపీ పోలీసుల తీరును ఖండిస్తూ నినాదాలు చేసి తహసీల్దార్ అమరేందర్ కృష్ణకు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా జర్నలిస్టు సంఘాల నాయకులు మాట్లాడుతూ.. ఎలాంటి నోటీసు లేకుండా విజయవాడలోని ‘సాక్షి’ ఎడిటర్ ఆర్.ధనుంజయరెడ్డి నివాసానికి వెళ్లి భయబ్రాంతులకు గురిచేయడం సరికాదన్నారు. పోలీసుల అనుసరించిన విధానాన్ని ప్రెస్‌కౌన్సిల్ ఆఫ్ ఇండియాతో పాటు ఉన్నత న్యాయస్థానాల దృష్టికి తీసుకువెళ్లాలని తీర్మానించారు. వాస్తవాలను ఎప్పటికప్పుడు ప్రజల్లోకి తీసుకెళ్తున్న కారణంగా జర్నలిస్టులను భయపెట్టి అదుపులో పెట్టుకోవాలన్న ఏకై క లక్ష్యంతో ఏపీ పోలీసులు తనిఖీలు చేశారని, అన్ని యూనియన్లు ఈ చర్యను ముక్తకంఠంతో ఖండిస్తున్నట్లు ప్రకటించారు. ఏపీలో జర్నలిస్టులపై మొదలైన పోలీస్ వేధింపులను తక్షణమే ఆపకపోతే జాతీయ స్థాయిలో నిరసనలకు దిగుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఆనంద్‌కుమార్ గౌడ్, రాజేష్ కుమార్, నవీన్ కుమార్, అనంతరాములు, లొట్టి శీను, రఘు, యాదన్న, రాజశేఖర్, వెంకట రాములు, రాజేష్, సంతోష్, శ్రీధ తదితరులు పాల్గొన్నారు.