
లక్ష్యానికి మించి..!
కొనుగోలు కేంద్రాలకు భారీగా ధాన్యం తీసుకువస్తున్న రైతులు
నారాయణపేట: బయటి మార్కెట్‌లో ధాన్యానికి గిట్టుబాటు ధర లేకపోవడం.. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో క్వింటాకు రూ.500 బోనస్ అందిస్తుండడం.. అకాల వర్షాలు, గాలివానల భయం వెంటాడుతుండడం.. మొత్తంగా జిల్లాలో అనుకున్న దానికంటే అధికంగా రైతులు ధాన్యాన్ని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు తీసుకువస్తున్నారు. ఇక్కడే అసలు సమస్య మొదలైంది. రైతులు ఒక్కసారిగా ధాన్యం తీసుకువస్తుండడంతో మిల్లులు, గోడౌన్‌లలో ధాన్యం దింపుకొనేందుకు స్థలం లేకుండాపోయింది. దీంతో తెచ్చిన ధాన్యం కొనుగోలు చేయాల్సిందేనని రైతులు.. స్థలం లేదు మేం దింపుకోం అంటూ మిల్లు యజమానులు తేల్చి చెబుతుండడంతో ఇటీవల పలు చోట్ల రైతులు ఆందోళనకు దిగిన ఘటనలు చోటుచేసుకున్నాయి.
43 మిల్లులు.. 1.12 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యం
జిల్లాలోని రైస్ మిల్లుల్లో ధాన్యం నిల్వల కేపాసిటీ 1.12 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే. కాగా ఈ సారి ధాన్యమంతా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు రైతులు తీసుకువస్తుండడంతో కెపాసిటీ ఉన్న దాన్ని పెంచి డబుల్ టైమ్ కెపాసిటీగా ధాన్యాన్ని కేటాయిస్తు వస్తున్నారు. దీంతో మిల్లర్లు తమ గోడాన్‌తో పాటు బహిరంగ ప్రదేశంలో ధాన్యం బస్తాలను పెర్చుతూ నిల్వ చేస్తున్నారు. దీంతో ఊట్కూర్, మాగనూర్, క్రిష్ణ మండలాల్లోని రైస్ మిల్లుల కెపాసిటీ ఇప్పటికి డబుల్ కెపాసిటీ సైతం ముగిసినట్లు అధికారులు చెబుతున్నారు. మిగతా మిల్లులో సైతం ధాన్యాన్ని సీఎంఆర్ చేసేందుకు సమయం పడుతుండడంతో మిల్లర్లు ఇబ్బందులు తప్పడం లేదని చెప్పవచ్చు.
గాలి, దూలి వానలతో పరేషాన్‌లో రైతులు
యాసంగిలో వేసిన వరి పంట చేతికి వస్తున్న సమయంలో గాలి, దూలి వానలతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఉగాది కంటే ముందు కోతలు చేసిన రైతులు ఊపిరి పీల్చుకున్నారు. గత వారం రోజులుగా కోతలు అధిక మొత్తంలో చేపట్టడంతో ఒక్కసారిగా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు ధాన్యం చేరుకుంటుంది. ఓ వైపు కల్లాలు లేకపోవడం.. రోడ్లపై ఆరబెట్టుకోవడం.. ఆకాల వర్షాలతో ఎక్కడ ధాన్యం తడిసిపోతుందంటూ రైతులు వాపోతున్నారు.
లక్ష్యం 1.50 లక్షల మెట్రిక్ టన్నులు
యాసంగిలో ప్రభుత్వం 1.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణే లక్ష్యంగా సివిల్ సప్లయ్ అధికార యంత్రాంగం ప్రణాళికలు సిద్దం చేసింది. కాగా ఇప్పటి వరకు 97 ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా 8,401 మంది రైతులతో 6,98,237 క్వింటాళ్ల ధాన్యాన్ని సేకరించారు. ఇందులో దొడ్డు రకం 1,55,651 క్వింటాళ్లు, సన్నరకాలు 5,42,585 క్వింటాళ్లు కొనుగోలు చేశారు. 6,45,243 క్వింటాళ్లు ఇప్పటికే రైస్‌మిల్లులకు చేరుకున్నాయి.
మరికల్‌లోని రాయచూర్ రోడ్డులోని మిల్లు వద్ద బారులు తీరిన వాహనాలు
ఒక్కో రైస్‌మిల్లుకు రెట్టింపు స్థాయిలో ధాన్యం కేటాయింపులు
ఇప్పటికే ధాన్యంతో నిండిన
మిల్లులు, గోడౌన్‌లు
అకాల వర్షాలు, గాలివానల భయంతో త్వరగా ధాన్యం విక్రయానికిరైతుల మొగ్గు
స్థలం లేక మిల్లర్ల ఇబ్బందులు
జిల్లాలో ధాన్యం సేకరణ లక్ష్యం 1.50 లక్షల మెట్రిక్ టన్నులు

లక్ష్యానికి మించి..!