
విధి విధానాలు ఇలా..
కోస్గి: వ్యవసాయ రంగాన్ని పూర్తిగా డిజిటలైజ్ చేయాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం రైతులకు ప్రత్యేక గుర్తింపు కార్డులు జారీ చేసేందుకు చర్యలు తీసుకుంటుంది. దేశంలోని ప్రతి పౌరుడికి ఆధార్ కార్డుతో గుర్తింపు ఇచ్చినట్లుగానే వ్యవసాయ భూమి ఉన్న ప్రతి రైతుకు 14 అంకెలతో కూడిన ప్రత్యేక విశిష్ట సంఖ్య(యూనికోడ్) కేటాయించి ఫార్మర్ ఐడీలు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించి ఈ నెల 5 నుంచి రైతుల నుంచి దరఖాస్తులు తీసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. భూమి ఉన్న ప్రతి రైతు తనకున్న భూములకు సంబంధించిన సమగ్ర వివరాలతో ఈ ఫార్మర్ ఐడీలు ఇవ్వాలని ప్రభుత్వ ఆదేశాల్లో స్పష్టంగా పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘ఫార్మర్ ఐడీ’ ప్రాజెక్టును అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సైతం సిద్ధమైంది. ఇప్పటికే వ్యవసాయ విస్తరణ అధికారులకు(ఏఈఓలకు) శిక్షణ ఇచ్చిన ప్రభుత్వం నేటి నుంచి రైతుల నుంచి దరఖాస్తులు తీసుకోవాలని ఆదేశించింది.
ఫార్మర్ ఐడీ రైతులకు అందించే డిజిటల్ గుర్తింపు కార్డు. ఇది రైతు ఆధార్ కార్డుతో లింక్ చేసి 14 అంకెల ఐడీని జారీ చేస్తారు. ఈ కార్డులో రైతు పేరు, ఆధార్ నంబర్, ఆధార్‌తో అనుసంధానమైన ఫోన్ నంబర్, భూమి పట్టాపాస్ బుక్ వివరాలు, భూమి రకం(ఎర్ర నేల, నల్ల నేల, తరి, మెట్ట పొలం), సర్వే నంబర్లు, సాగు చేసే పంటల వివరాలు తదితర సమాచారం నమోదు చేస్తారు. ఈ గుర్తింపు కార్డు ద్వారా రైతు సాగుకు సంబంధించిన పంట వివరాల చిట్టా మొత్తం ఒక్కక్లిక్‌తో ఆన్‌లైన్‌లోనే తెలుసుకోవచ్చు. ఇందుకు గాను రైతులు తమ ఆధార్ కార్డు, భూమి పట్టాపాస్ బుక్, ఆధార్‌తో లింక్ చేసిన ఫోన్ నంబర్‌ను మండల వ్యవసాయ శాఖ అధికారులకు గాని, ఆయా గ్రామా ల ఏఈఓలకు గాని అందజేయాల్సి ఉంటుంది.